
హైదరాబాద్: దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్ర విధి నిర్వహణలో అంకితభావంతో పోలీసు వృత్తికే వన్నె తెచ్చారని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు. ఆయన 52వ జయంతి కార్యక్రమాన్ని గురువారం ఎస్సార్‌నగర్ చౌరస్తాలో నిర్వహించారు. అక్కడి ఉమేశ్‌చంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఉమేశ్‌చంద్ర అని అన్నారు.
అలుపెరగని రీతిలో పనిచేసిన ఆయన భావితరాలకు, ప్రస్తుత పోలీసు యంత్రాంగానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉగ్రవాదం, జర్నలిజం వంటి చర్యల ద్వారా దేశ సమగ్రత, రక్షణలకు ఆటంకం కలిగించే వారిని చిత్తశుద్ధితో ఎదుర్కొన్న పోరాటయోధుడని అభివర్ణించారు. తోటి సిబ్బంది పట్ల ఉమేశ్‌చంద్ర చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.