సాక్షి, మెదక్/ నర్సాపూర్: తమ బిడ్డలను కడసారి చూసేందుకు కన్నపేగులు ఆరాటపడుతున్నాయి.. మృత్యువాత పడ్డ తమ ఇంటి పెద్దదిక్కును చూసేందుకు భార్యా.. పిల్లలు తపిస్తున్నారు. దివికేగిన తమవారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పది కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆదివారం తమిళనాడులోని పుదుకొట్టై సమీపంలో రామేశ్వరం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన తొమ్మిది మందితో పాటు వాహన డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. తమవారి మృతదేహాల రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. శబరిమల నుంచి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో కాజిపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామాలకు చెందిన నాగరాజుగౌడ్, బోయిని కుమార్, మహేశ్ యాదవ్, శివసాయిప్రసాద్, శ్యాంసుందర్‌గౌడ్, ఆంజనేయులు, కృష్ణాగౌడ్, సురేశ్, ప్రవీణ్‌గౌడ్‌లు మృతి చెందారు. వీరితోపాటు వాహన డ్రైవర్ సురేశ్ మృత్యువాతపడ్డాడు. కాగా, పది మంది మృతదేహాలను నర్సాపూర్ తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ నేత మురళీయాదవ్, నర్సాపూర్ తహసీల్దార్ భిక్షపతి, సీఐ సైదులు ఆదివారం రాత్రి పుదుకొట్టై వెళ్లారు. సోమవారం అక్కడికి చేరుకుని రోడ్డు ప్రమా దం గురించి స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మృతదేహాలను చూసి పోస్టుమార్టం నిర్వహించేందుకు అవసరమైన పత్రాలను తహసీల్దార్ భిక్షపతి, సీఐ సైదులు పూర్తి చేశారు. మృతదేహాలకు మధ్యాహ్నం 2 గంటలకు పుదుకొట్టైలోని ప్రభు త్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వం సమకూర్చిన అంబులెన్స్‌లలో మృతదేహాలను నర్సాపూర్ తీసుకువస్తున్నారు. సోమవారం సాయంత్రం వీరు బయలుదేరారు. అక్కడి నుంచి నర్సాపూర్ దాదాపు వెయ్యికిలోమీటర్ల దూరం ఉండటంతో మంగళవారం మధ్యా హ్నం వరకు మృతదేహాలు గ్రామాలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహ నం డ్రైవర్ సురేశ్ మృతదేహన్ని అతని స్వగ్రామమైన తూప్రాన్ మండలంలోని నెంటూరుకు తరలించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దూరం ఎక్కువగా ఉండటంతో ఒక్కో అంబులెన్స్‌లో ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో గాయపడిన నరేశ్‌గౌడ్‌ను విమా నం ద్వారా హైదరాబాద్‌కు తీసుకొ చ్చారు. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్ తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతర క్షతగాత్రులు రాజు, భూమాగౌడ్, శ్రీశైలం యాదవ్‌లకు పుదుకొట్టై ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నారు. వీరు మరో నాలుగు రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
శోకసంద్రంలో కుటుంబాలు
నర్సాపూర్ మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రా మాలు సోమవారం శోకసంద్రమయ్యాయి. మృతుల ఇళ్లవద్ద విషాదఛాయలు అలుము కున్నాయి. రోడ్డు ప్రమాదం వార్త తెలిసిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరుగా గ్రామాలకు తరలివస్తున్నారు. కన్నీరుమున్నీరు అవుతున్న మృతుల కుటుంబీకులను ఓదార్చటం ఎవ్వరి తరం కావటంలేదు. ఇది వరకే ఓ రోడ్డు ప్రమాదంలో పెద్దకొడుకును కోల్పోయిన చిన్నచింతకుంటకు చెందిన భాగ్యమ్మ ఇప్పుడు చిన్నకొడుకు ప్రవీణ్‌గౌడ్‌ను కూడా కోల్పోయింది. దీంతో ఆమె ఆవేదన అలవికానిదిగా ఉంది. సోమవారం ఆమె తన పిల్లలను గుర్తుచేసుకుంటూ రోదించడం అందరినీ కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment