
కరెంట్ బిల్లులకు 10 వేల కోట్లు
⇔ ఎత్తిపోతల పథకాల విద్యుత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
⇔ దాదాపు 9 నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ కావాలి
⇔ ధర్నాచౌక్ తరలింపుపై నిర్ణయం మాది కాదు..
⇔ కోర్టు నోటీసులతోనే ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తింపు
⇔ కోర్టులు చెప్పినా వినమంటే మేమేం చేయాలి?
⇔ ఛత్తీస్‌గఢ్ కరెంట్ యూనిట్‌కు రూ.3.70 లేదా రూ.3.90
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలోని కాళేశ్వరం, పాలమూరు, కల్వకుర్తి, బీమా, నెట్టెం పాడు, డిండి ఎత్తిపోతల పథకాలకు దాదాపు 9 వేల నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని తెలిపారు. బుధవారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. ‘‘కృష్ణా బేసిన్లో నీటి లభ్యత ఉన్నప్పుడే అప్పటికప్పుడే నీళ్లను తరలించుకోవాలి.
ఇక్కడి ప్రాజెక్టులకు రాత్రింబవళ్లు విద్యుత్ సరఫరా అవసరం. గోదావరిలో ఆర్నెల్ల పాటు నిల్వ ఉంటాయి. దీనిపై ఉన్న ఎత్తిపోతలకు రాత్రి వేళల్లో ఎక్సే్ఛంజీల నుంచి చౌక విద్యుత్ సరఫరా చేస్తాం. విద్యుత్ ఎక్సే్ఛంజీల్లో రాత్రి పూట యూనిట్‌కు రూ.1.50 నుంచి రూ.2కే విద్యుత్ లభ్యత ఉంది’’ అని వివరించారు. ధర్నాచౌక్ తరలింపు అంశాన్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఈ మధ్య జరిగే చిల్లర వ్యవహారాలు చూస్తున్నం. కోర్టులు చెప్పుతున్నా మేం వినం.
బేఖాతరు చేస్తం. ధర్నాల తేదీలు, స్థలం మేమే ప్రకటిస్తాం... రక్తాలు కారినా సరే ధర్నాలు చేస్తం.. అని కొందరు అంటుంటే ఏం చేయాలి. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యానికి అందం. మేం కూడా ఈ వెసులుబాటు ఉండాలనే కోరుకుంటున్నాం. అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మేం ఇంకా ధర్నాచౌక్‌ను రద్దు చేయలేదు. ధర్నాచౌక్‌తో ఇబ్బందు లు వస్తున్నాయని స్థానికులు కోర్టుకు ఆశ్రయించడం తో ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం చేసిందేమీ లేదు. ధర్నాచౌక్ తరలింపు కోసం ప్రత్యామ్నాయ స్థలాలు ఎంపిక చేయాలని పోలీ సులను కోరాం.
5 వేల మందికి పైగా జనం పాల్గొనే బహిరంగ సభలు నిజాం కళాశాల మైదానంలో కాకుం డా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని ఆదేశించాం’’ అని వివరించారు. గతంలో లుంబినీ పార్కు వద్ద ధర్నా చౌక్ ఉండేదని, ఆ తర్వాత ఇందిరా పార్కు వద్దకు తరలిందని సీఎం చెప్పారు. సచివాలయం, శాసనసభకు సమీపంలో ధర్నాలు చేయరాదని ఇప్పటికే జీవోలు కూడా ఉన్నాయని తెలిపారు. ధర్నా ఎక్కడ చేసినా ఒక్కటేనని, మీడియాలో ప్రసారం జరుగుతుందని, ప్రభుత్వం దృష్టికి వస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ బహిరంగ సభ ప్రభావం ఓయూ శతాబ్ది ఉత్సవాలపై ఉండదన్నారు.
నీతి ఆయోగ్ సిఫారసులను తిరస్కరించాం
బువ్వ లేక సచ్చిపోతున్నారంటే అధిక రాయితీలు వద్దని ఆర్థికవేత్తలు అంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్ల గుండెపై కుంపటి. పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకుంటుంటే కల్యాణ లక్ష్మి వద్దని ఆర్థికవేత్తలు అనడం ఏమిటి? ఈ పథకం వద్దని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను తిరస్కరించి వెనక్కి పంపినం. దేశంలో నోట్ల రద్దు పాక్షికంగా విజయవంతమైంది. ఇంకా పూర్తిగా అమలు కావాల్సి ఉంది’’అని అన్నారు.
వ్యవసాయ పథకాలపై సమీక్ష అవసరం
జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ బీమా పథకంలో లోపాలున్నాయని సీఎం అన్నారు. మిర్చీకి దేశంలోనే అత్యధిక ధర తెలంగాణలోనే ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర భూసేకరణ చట్టానికి వారం రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రక్రియ మొదలైనట్టు తమకు సమాచారం ఉందన్నారు.
కేంద్రం మద్దతిస్తుందని భావిస్తున్నాం
రాష్ట్రాల నుంచి వచ్చే సీఎంలను బికారీలాగా చూడదల్చుకోలేదని, రాష్ట్రాల సిఫారసులను గౌరవిస్తామని ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశంలో పేర్కొన్నారని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో తాము తేనున్న రిజర్వేషన్ల చట్టం విషయంలో కేంద్రం మద్దతిస్తుందని భావిస్తున్నామన్నారు. లేకుంటే ఎంత దూరమైనా ఈ విషయం తీసుకెళ్తామన్నారు. ఎన్డీఏలో లేకపోయినా ఎలాంటి ఘర్షణ లేకుండా కేంద్రానికి వంద శాతం మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు.
‘ఛత్తీస్’ ధర ఖరారవుతుంది..
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఖరారు కాబోతోందని, యూనిట్‌కు రూ.3.70 లేదా రూ.3.90 ధరతో రాష్ట్రానికి రానుందని ముఖ్యమంత్రి తెలిపారు. 1000 మెగావాట్ల విద్యుత్ ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటుండగా, వార్ధా–డిచ్‌పల్లి కారిడార్‌లో 2000 మెగావాట్ల స్లాట్‌ను బుక్ చేసుకున్నామన్నారు. ఇప్పటికే మూడు విద్యుత్ కారిడార్లు ఉండగా, త్వరలో అందుబాటులోకి వరంగల్–వరోరా, రాయగడ–ఉంగనూరు కారిడార్లు అందుబాటులోకి వస్తే దేశంలోని ఏ మూల నుంచైనా ఏ రాష్ట్రమైనా విద్యుత్ కొనవచ్చని చెప్పారు.