-తనిఖీలు చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు
-ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందించే '108' అంబులెన్సులపై నిరంతర తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ అంబులెన్సుల వైద్య సేవలకు సంబంధించి కొంతకాలంగా వస్తోన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి ఇటీవల జిల్లాలకు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 337 అంబులెన్సులు '108'కింద అత్యవసర వైద్య సేవల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. ఒక్కో అంబులెన్సు ప్రతీ రోజూ నాలుగు అత్యవసర కేసుల బాధితులను ఆసుపత్రులకు చేరవేస్తుందన్నారు. అయితే నాలుగే కాకుండా ఇంకా కొన్ని కేసుల్లో బాధితులను తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. రోజువారీ పర్యవేక్షణతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రాంతీయ వైద్యాధికారి (ఆర్‌డీ), జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో), సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి తనిఖీలు చేయాలని ఆదేశించారు.
తన జోన్ పరిధిలో నెలకు కనీసం 10 శాతం అంబులెన్సుల పనితీరును ఆర్‌డీ తనిఖీలు చేయాలని బుద్దప్రకాష్ అన్నారు. డీఎంహెచ్‌వో నెలకు 25 శాతం తనిఖీ చేయాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి నెలలో ప్రతీ అంబులెన్సును తనిఖీ చేయాలని తెలిపారు. తనిఖీ చేసినట్లుగా అంబులెన్సులో ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీల నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. గర్భిణీ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ వివరాలతో సహా ప్రతీ నెల ఒకటో తేదీన తన పరిధిలోని పర్యవేక్షణ సెల్‌కు మెయిల్ ద్వారా పంపించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అలాగే ప్రతీ నెల జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశమై 108 పనితీరుపై చర్చించి అందుకు సంబంధించిన మినిట్స్‌తో నివేదికను పంపించాలన్నారు. సీనియర్ ప్రజారోగ్య అధికారులు ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల ద్వారా గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు 108ను వినియోగించుకోవాలంటూ చైతన్య పరచాలని కోరారు. రాష్ట్ర స్థాయిలోని నోడల్ ఆఫీసర్ జిల్లాల్లో పర్యటిస్తే కనీసం ఒక్క అంబులెన్సునైనా తనిఖీ చేయాలన్నారు.
108 అంబులెన్సులపై నిరంతర నిఘా
Published Tue, Feb 23 2016 10:24 PM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
Advertisement
Advertisement