సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్ల అభివృద్ధి, కొత్త సచివాలయ నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ... వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,800 కోట్లను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదిస్తోంది. ఆర్థికమంత్రికి సమర్పించేందుకు నివేదికను సిద్ధం చేసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.3,806 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రతిపాదనలు సిద్ధం కాకపోవటం, ఎక్కువ సమయం లేకపోవటంతో ఇందులో దాదాపు రూ.వెయ్యి కోట్లు మిగిలే అవకాశం ఉంది. దీంతో ఈసారి భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసి నివేదిక రూపొందించారు.
ప్రస్తుతం ఉన్న 10 వేల కిలోమీటర్ల రోడ్లను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 వేల కోట్లను మంజూరు చేసింది. ఇందులో తొలుత రూ.2,500 కోట్ల పనులు ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులకు సంబంధించి కొత్త బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించాల్సిందిగా అధికారులు ప్రతిపాదించారు. వచ్చే సంవత్సరకాలంలో ఇంతకంటే ఎక్కువ పనులు చేయటం సాధ్యం కానందున దాన్ని అక్కడికే పరిమితం చేశారు.
ఇక నియోజకవర్గ కేంద్రాల మీదుగా ఉన్న అన్ని రోడ్లను డబుల్ రోడ్లుగా చేసే ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కచ్చితంగా రెండు లేన్ల రోడ్లు ఉండాలని సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ పనులకు రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. జాతీయ రహదారులకు సంబంధించి పీపీపీ పనులకు రూ.వెయ్యి కోట్లు, భవనాల విభాగానికి రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. ఎర్రగడ్డలో కొత్తగా నిర్మించబోయే సచివాలయానికి రూ.490 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్న అధికారులు... మంత్రివర్గ సమావేశం రూ.150 కోట్లకు తీర్మానం చేసినందున అంత మొత్తాన్ని ఇందులో చూపారు. ఇక రైల్వే లైన్ల కోసం అవసరమైన భూసేకరణ కోసం రూ.400 కోట్లు చూపారు. వెరసి రూ.10,800 కోట్లు కేటాయించాలని నివేదికలో స్పష్టం చేశారు.