వాట్సాప్‌లో టెన్త్ ఇంగ్లిష్ పేపర్
♦ వరంగల్‌లో లీక్.. ఖమ్మంలో ప్రత్యక్షం
♦ పోలీసులకు విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు
ఖమ్మం జెడ్పీసెంటర్: పదో తరగతి ఇంగ్లిష్ పశ్నపత్రం లీకేజీ ఖమ్మంలోని పలువురి వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పేపర్–1 మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత వాట్సాప్‌లలో ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. అన్ని వాట్సాప్‌లలో ప్రశ్నలు కనిపించడంతో లీకేజీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న విద్యాధికారులు వెంటనే ఎంఈవోలు, చీఫ్ సూపరింటెండెంట్‌లను అప్రమత్తం చేశారు.
ప్రశ్నపత్రం లీకైందనే వార్తలతో ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు డీఈవో కార్యాలయానికి వచ్చి విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మీబాయి, వరంగల్ ఆర్జేడీ బాలయ్యతో సంప్రదింపులు జరిపారు. ఉదయం 9.30 గంటలకే పరీక్ష ప్రారంభమైందని, 11.30 గంటలకు పరీక్ష పూర్తయి ఉంటుందా? లేక విద్యార్థి పరీక్ష రాసి వస్తే అతడి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో పెట్టారా? లేదా నిజంగా లీక్ అయిందా? అనే విషయం విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై డీఈవో విజయలక్ష్మీబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో పరీక్షలు భారీ బందోబస్తు మధ్య పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అయితే ఓ చానల్‌లో 12.15 గంటలకు ప్రశ్నపత్రం లీక్ అయిం దని కథనాలు ప్రసారమయ్యాయని, దీని ఆధారంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.
వాట్సాప్‌లో వచ్చిన పేపర్ ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చర్చించి.. అసలు వ్యవహా రాన్ని రాబట్టారు. చివరకు ప్రశ్నపత్రాన్ని వరంగల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వాట్సాప్‌లో పెట్టినట్లు వెల్లడైంది. అయితే జిల్లాలో పదో తర గతి పరీక్షల ప్రారంభం నుంచి పేపర్ లీక్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు పలు స్కూళ్ల యాజమాన్యాల మ«ధ్య అంతర్గత పోరు నేపథ్యంలో ప్రచారం ఎక్కువైంది. ఏదేమైనా ఇక్కడ ప్రశ్నపత్రం లీక్ కాలేదని వెల్లడి కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపీరి పీల్చుకున్నారు.