సాక్షి, హైదరాబాద్: ‘‘1.12 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై కృత నిశ్చయంతో ఉన్నాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇదే విషయం చెప్పాను. ఆ ప్రకారం 1.12 లక్షలే కాదు అంతకు ఒక వెయ్యి ఎక్కువే ఇస్తాం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ టీఎస్‌పీఎస్సీపై, గ్రూప్స్-2 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. దాంతో స్పందించిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షలుందని.. కాంగ్రెస్ సహా అంతకుముందు 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా తమలా చేయలేదని పేర్కొన్నారు. నిర్మాణాత్మక పంథాలో సభ్యులు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయవద్దని సూచించారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దళితుడని, సంస్కరణలతో ఆయన రాష్ట్రానికి గౌరవం తెచ్చి పెట్టారని సీఎం ప్రశంసించారు. యూపీఎస్సీ కూడా ఆయనను అభినందించి మొదటిసారిగా యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసిందని చెప్పారు. ఇక నిరుద్యోగుల అంశంలో ఏదో మూటగట్టుకోవాలని ప్రయత్నించడం, అందుకు సోనియాగాంధీ పేరు ముందుకు తీసుకురావడం, అమరులంటూ ఏదేదో మాట్లాడటం మంచిదికాదని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. అదంతా పాత రాజకీయమని, ఇప్పుడది పనిచేయదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉందని, నిజాలన్నీ బయటకు వస్తాయని.. అందువల్ల పద్ధతిగా వ్యవహరించాలని సూచించారు.
పొరపాట్లు సహజం
తెలంగాణ కొత్త రాష్ట్రమని, అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరగకుండా ఉంటాయా? వాటిని సరిదిద్దుకుంటూ పోతుంటాం. ఈ ప్రభుత్వం తప్పులు చేయడం సర్వసాధారణమన్నట్లు మాట్లాడితే.. అదో భాషేనా? అలా మాట్లాడితే గౌరవం వస్తుందా? మంచిగా మాట్లాడే వారి విలువ వేరేగా ఉంటుంది. లేకుంటే మరో రకంగా ఉంటుంది. సభ్యులు వారి స్థాయిని, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. షార్ట్‌కట్ పద్ధతులతో ఒక్క రోజుకో, ఒక్క పూటకో ప్రశ్న అడిగితే ఐదు నిమిషాలు ఆనందం ఉంటుంది తప్ప అది గొప్పతనం కాదు.’’అని వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి అమలుపై లక్ష పేజీల పెన్‌డ్రైవ్ ఇస్తాం
విద్య, స్కాలర్‌షిప్ విషయంలో ఆవాస విద్యకు కేంద్రం, నీతి ఆయోగ్ ప్రాధాన్యమిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. దాన్ని మన రాష్ట్రం ఇప్పటికే మొదలుపెట్టిందని.. మన మోడల్‌నే కేంద్రం తీసుకుందని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని.. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ దీనిపై చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇదే పద్ధతిని మైనారిటీ, బీసీ, ఎస్టీలకు అమలుచేసే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లు తెచ్చాక ఎంత ఖర్చు చేశామో పైసా లెక్కతో సహా ప్రతి సభ్యుడికి ఒకటి రెండు రోజుల్లో దాదాపు లక్ష పేజీలుండే పెన్‌డ్రైవ్ ఇవ్వనున్నామన్నారు. దళితులు, బలహీనవర్గాల పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీగా ‘విదేశీ విద్య’స్కాలర్‌షిప్‌ను ఇస్తున్నామని చెప్పారు.
అత్యవసర అంశమైనా పట్టించుకోరా?
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి నిరాకరించడంతో అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టకూడదని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు మాట తప్పుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిం చారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టవద్దన్న నిర్ణ యం వాస్తవమేనని, కానీ అత్యవసర అంశం కాబట్టి వాయిదా తీర్మానం తీసుకోవాలని కోరామని వివరించారు. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వాయిదా తీర్మానాన్ని చేపట్టకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక కాంగ్రెస్ తీరును ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. జానారెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీఏసీలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని పాటించకపోతే ఎలాగని విమర్శించారు. ఇక నిరుద్యోగ యువతకు ప్రభుత్వోద్యోగాలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు.
గ్రూప్స్-2 లో భారీగా అవకతవకలు
శాసనసభలో తొలుత కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ గ్రూప్స్-2 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అందువల్ల కొత్త పోస్టులతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కోడింగ్, డీకోడింగ్‌లో అవకతవకలు జరిగాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక నోట్ కూడా ఇచ్చారని.. ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ అయిందని పేర్కొన్నారు. అసలు ఓఎంఆర్ షీట్ నాణ్యత లేదని, దీనిపై కోర్టు కూడా ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని.. దాంతో టీచర్ల భర్తీ పరీక్షలో సరిదిద్దుకున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లుగా తప్పులు చేయడం, సరిదిద్దుకోవడమే అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
ఆ ఆరోపణలు అవాస్తవం
గ్రూప్స్-2 పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శాసనసభలో బదులిచ్చారు. ఒకవేళ అవకతవకలు జరిగినట్లు తేలితే క్షమాపణ చెబుతామన్నారు. ప్రతి అభ్యర్థి జవాబుపత్రం జిరాక్స్ వారివద్దే ఉందని, దీనిపై కోర్టుకు వివరాలు కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. కోర్టు సూచన మేరకు ఎంపిక చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాలను తనిఖీ చేసి జాబితాలను కూడా సమర్పించామని చెప్పారు. ఓఎంఆర్ షీట్‌ను పాత పద్ధతి ప్రకారం కాకుండా అధునాతన టెక్నాలజీ ప్రకారం స్కానింగ్ చేశామని, ఆ పద్ధతిని యూపీఎస్సీ కూడా ఉపయోగిస్తుందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు రాగానే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment