దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి
► అంబేద్కర్ పుణ్యంతోనే తెలంగాణ సిద్ధి
► దళితులు, గిరిజనులకు డబుల్‌బెడ్‌రూమ్‌లో మొదటి ప్రాధాన్యం
► మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో బడుగు, బలహీన, దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్‌చౌక్‌లో వేడుకలు నిర్వహించారు. ఎంపీ గొడం నగేష్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్‌మోహన్, జేసీ సుందర్ అబ్నార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జెమ్స్ కల్వాలలతో కలిసి మంత్రి జోగురామన్న మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచశీల జెండాను ఆవిష్కరించారు. జ్యోతిప్రజ్వలన చేసి వేదిక వద్ద బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్‌తోనే తెలంగాణ వచ్చిందని, దీనికి ముఖ్య కారణం అంబేద్కరేనని పేర్కొన్నారు. అంబేద్కర్ పుణ్యంతోనే తనకు పదవి దక్కిందని మంత్రి జోగు రామన్న చెప్పుకొచ్చారు. దళితులు, గిరిజనులకు డబుల్‌బెడ్‌రూమ్ పథకంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో గత నవంబర్‌లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలకు సంబంధించి చర్చలు ప్రారంభం సందర్భంగా తాను పాల్గొనడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై డెహ్రాడూన్‌లో ప్రశంసలు లభించాయని పేర్కొన్నారు.
మజిల్లా కలెక్టర్ ఎం.జగన్‌మోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ గురించి చర్చా కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని, ప్రపంచానికే గొప్పదార్శనికుడు అంబేద్కరని కొనియాడారు. పథకాలను పేద దళితులకు ఆస్తుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా, ఆర్డీవో సుధాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు బాబు గజ్బారె, భారతీయ బౌద్ధ మహాసభ సభ్యులు గంగారాం బోరేకర్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి సోగల సుదర్శన్, ప్రజ్ఞకుమార్, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్ ప్రొటక్షన్ సొసైటీ సభ్యులు సుశీల, రాజారాం, రమా బాయి అంబేద్కర్ సంఘం నుంచి కమలాబాయి, ఎమ్మార్పీఎస్ సంఘం సభ్యులు మారంపల్లి శంకర్, నక్కరాందాస్, మల్యాల మనోజ్, మహా ఎమ్మార్పీఎస్ నుంచి నర్సింగ్, ప్రసాద్, దళిత సంఘాల నాయకులు మేకల మల్లన్న, బాలకృష్ణ, గణేష్ జాదవ్, బండారి దేవన్న, మల్యాల భాస్కర్, సంతోష్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు విశ్వప్రసాద్, దయానంద్ గైక్వాడ్ పాల్గొన్నారు.