
22 లక్షల మందికి మొండిచెయ్యి!
14 లక్షల మంది రైతులకే కొత్త రుణాలిచ్చిన బ్యాంకులు
రుణ మాఫీ కింద రూ. 4,250 కోట్లతో 36 లక్షల రైతులకు లబ్ధి
బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు సుమారు రూ. ఆరువేల కోట్లే..
హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ పొందిన రైతుల్లో సగానికిపైగా మందికి బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా.. 25 శాతం రుణమొత్తాన్ని విడుదల చేసినా.. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినా.. రైతులు కాళ్లరిగేలా తిరిగినా.. క్షేత్రస్థాయిలో బ్యాంకులు ఏమాత్రం సహకరించలేదు.. రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయలేదు.. అసలు ‘రుణ మాఫీ’పై ప్రభుత్వం చేసిన తీవ్ర జాప్యం కారణంగానే బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు అందించేలేకపోయాయనే అభిప్రాయం కూడా వస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ముగిసినందున రైతులే రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్న కొత్త వాదనను ప్రభుత్వ అధికారవర్గాలు ముందుకు తీసుకుని వస్తుండడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద 36 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించి, తొలి విడతగా రూ. 4,250 కోట్లను విడుదల చేయగా.. బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చింది కేవలం 14 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే దాదాపు 22 లక్షల మంది రైతులకు ఈసారి ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదన్నది స్పష్టమవుతోంది. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించలేదు. దీంతోపాటు రుణ మాఫీపై ప్రభుత్వం త్వరగా తేల్చకుండా జాప్యం చేయడంతో పాటు... మొత్తం నిధులు జమచేయని కారణంగా బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేయలేదు.
సగం కన్నా తక్కువ...
రుణమాఫీ కింద తొలివిడతగా ప్రభుత్వం చెల్లించిన రూ. 4,250 కోట్లకు తోడుగా మరో రూ. 1,800 కోట్ల కొత్త రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. విడుదల చేసిన మొత్తానికి కనీసం రెట్టింపు రుణాలైనా రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ శనివారం నాటికి అధికారులకు అందిన సమాచారం మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది రైతులకు కేవలం రూ. ఆరు వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అయితే రుణాలు ఇవ్వడాన్ని నిరంతర ప్రక్రియగా అధికారులు అభివర్ణిస్తున్నారు. మొన్నటివరకు రైతులకు పంటల బీమా అమలు చేయడానికి గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కోరిన యంత్రాంగం.. బీమా సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ రైతులు పంటల బీమాకు మొగ్గు చూపడం లేదని పేర్కొంటుండడం గమనార్హం.
రబీకైనా అందేనా?
ఖరీఫ్ సీజన్ ముగిసిపోయినందున.. కనీసం రబీ సీజన్‌కు అయినా రైతులకు సక్రమంగా రుణాలు అందుతాయా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రబీలో రైతులకు రుణాల మంజూరు అంశంపై వచ్చే నెలలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగే అవకాశం ఉంది. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు సహకరించడం లేదంటూ సీఎం కేసీఆర్ ఇటీవల రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో అయినా వచ్చే సీజన్‌లో రైతులకు రుణాలు సరిగా అందుతాయేమోన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.