14 మంది తహసీల్దార్లకు స్థానచలనం
వెయిటింగ్‌లో ఉన్న నలుగురికి పోస్టింగ్
నిజామాబాద్ డీఆర్‌వోగా ఎస్.పద్మాకర్
త్వరలో మరో ఆర్డీవో బదిలీకి అవకాశం
ఇదివరకే బోధన్ ఆర్డీవో శ్యాంప్రసాద్ బదిలీ
ఆర్మూర్‌కు త్వరలో కొత్త ఆర్డీవో నియామకం
వేగంగా సాగుతున్న ‘పునర్విభజన’ ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా మొదటగా రెవెన్యూశాఖను పటిష్టం చేసేందుకు ప్రక్షాళన మొదలైంది. దీర్ఘకాలికంగా ఒకేచోట కొనసాగుతున్న రెవెన్యూ అధికారులతోపాటు పరిపాలన సౌలభ్యం, సమర్దత ఉన్న అధికారులను కొత్త జిల్లాల ఏర్పాటులో భాగస్వాములు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా 14 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లుగా వెయిటింగ్‌లో ఉన్న మరో నలుగురికి కూడా పోస్టింగ్ ఇచ్చారు.
అదే విధంగా నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా హైదరాబాద్‌లో భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శిగా ఉన్న ఎస్.పద్మాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పరిపాలనా సౌలభ్యం, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అవశ్యంగా భావించి బోధన్ ఆర్డీవో జీవీ శ్యాంప్రసాద్ లాల్‌ను ఇదీవరకే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్డీవోగా ప్రభుత్వం బదిలీ చేసినా ఆయన ఇంకా రిలీవ్ కాలేదు. కొత్త ఆర్డీవోను కూడా నియమించకపోగా.. ఒకేచోట దీర్థకాలికంగా పనిచేస్తున్న మరో ఆర్డీవోకు కూడా స్థానచలనం కలగనుందన్న ప్రచారం ఉంది. అలాగే కొత్తగా ఏర్పడిన ఆర్మూరు రెవెన్యూ డివిజన్‌కు పూర్తికాలపు ఆర్డీవోను కూడా రెండు రోజుల్లో నియమించనున్నట్లు తెలిసింది.
బదిలీలపై ‘పునర్విభజన’ ముద్ర
జిల్లాల పునర్విభజనలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఏర్పడనుండగా.. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్లను బదిలీ చేశారన్న చర్చ జరుగుతోంది. పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయగలరన్న భరోసా ఉన్న పలువురు తహసీల్దార్లను కీలకమైన ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది వేర్వేరు చోట్లకు బదిలీ చేయాలని కోరినా.. పరి పాలన సౌలభ్యం, కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో పె ట్టుకుని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా బదిలీలు చేసినట్లు తెలిసింది. ఈ క్ర మంలోనే డిచ్‌పల్లి తహసీల్దార్ డి.రవీందర్ ఆర్మూరు కావాలని కోరినా ఆ యనను పనితీరును పరిగణలోకి తీసుకుని కొత్తగా ఏర్పడే కామారెడ్డి జి ల్లా కేంద్రంలో తహసీల్దార్‌గా నియమించినట్లు సమాచారం.
అలాగే భిక్కనూర్ తహసీల్దార్ అంజయ్యను కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఏవోగా నియమించారు. బోధన్ తహసీల్దార్ సుదర్శన్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేసి, నిజామాబాద్ తహసీల్దార్ రాజేందర్‌ను ఆర్మూరుకు బదిలీ చేశారు. ఆర్మూరు తహసీల్దార్‌ను కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆర్మూరు, నిజామాబాద్ తహసీల్దార్ల బదిలీ విషయంలో మాత్రం ఓ డివి జన్ స్థాయి అధికారి సిఫారసు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా మొత్తం 14 మంది తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కలగగా.. వె యిటింగ్‌లో ఉన్న తహసీల్దార్లు ఎస్.పెద్దులు నిజామాబాద్ ఏవోగా పో స్టింగ్ దక్కగా, ఎస్.రఘునాథ్, కె.సుధాకర్ రెడ్డి, ఎం.డి.అబ్దుల్ ఘనీఖాన్‌లకు తాడ్వాయి, భిక్కనూరు, నిజాంసాగర్ తహసీల్దార్లుగా పోస్టింగ్ ఇచ్చారు.
జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా పద్మాకర్
కొంత కాలంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) పోస్టు ఎట్టకేలకు భర్తీ అయ్యింది. ఇన్‌చార్జి పాలనతో కొనసాగుతున్న ఈ పోస్టులో రెగ్యులర్ అధికారిగా ఎస్.పద్మాకర్‌ను నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బి.ఆర్.మీనా జీవో ఆర్.టి.నెం.300ను విడుదల చేశారు. పద్మాకర్ హైదరాబాద్‌లో భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బదిలీపై జిల్లాకు డిఆర్‌వోగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.