సాక్షి సిటీబ్యూరో: ‘హైదరాబాద్’ పేరు చెబితే ఘనమైన చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. ఒకనాడు దేశంలోనే సుసంపన్నమైన, ప్రపంచంలోనే ధనవంతులైన నిజాం రాజ్యంలో అన్నీ అద్భుతాలే. బ్రిటీష్ వలస నీడకు దూరంగా ఎదిగిన ఈ రాజ్యంలో సొంత కరెన్సీ, పోస్టల్, ఎయిర్‌వేస్ స్వతంత్రగా ఎదిగాయి. వీటికితోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా తన ఖాతాలో వేసుకుంది. అదే సొంత రైల్వే వ్యవస్థ. దేశంలో సొంతంగా రైల్వేను నడిపిన ఘనత హైదరాబాద్ సంస్థానానికే దక్కింది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం అక్టోబర్ 8న తొలి రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. ఆ పరుగు వెనుకు ఉన్న కథ ఇదీ..
1857 తరువాత బ్రిటిష్ పాలకులు హైదరాబాద్‌ను కలుపుతూ గ్రేట్ ఇండియన్ రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారు. కానీ తన రాజ్యంలో బ్రిటీష్ ఆధిపత్యాన్ని నిజాం అంగీకరించలేదు. అయితే, అభివృద్ధికి అధునిక అవసరాలను గుర్తించిన నిజాం సర్కారు సొంత రైల్వేను నెలకొల్పాలని నిర్ణయించింది. ఐదో నిజాం మీర్ తహీనియత్ అలీఖాన్ ఆఫ్జలుదౌలా అధికారంలోకి వచ్చిన పదకొండో ఏట.. 1868లో ‘నిజాం స్టేట్ రైల్వే’ ఏర్పాటుకు ఫర్మానా జారీ చేశారు. అయితే, మరుసటి ఏడు నిజాం చనిపోయారు. అప్పటికే ప్రధానమంత్రిగా ఉన్న ఒకటో సాలార్‌జంగ్ రైల్వేలైన్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అందుకు అవసరమైన ధనం కోసం ఆయన లండన్ మనీ మార్కెట్ నుంచి లోన్ తీసుకున్నారు. భారత పాలకులతో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా లండన్ మనీ మార్కెట్‌కు వెళ్లడం ఆరోజోల్లో పెద్ద సంచలనం.
ఆధునిక రాజ్యానికి పునాదులు
ఐదో నిజాం పాలనా కాలంలో హైదదరాబాద్ అభివృద్ధి బాటలో పడింది. ప్రధాని సాలార్ జంగ్ బ్రిటీష్ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి పోటీగా ఇక్కడా అభివృద్ధి చేపట్టారు. సంస్థానంలో సొంత రైల్వే, పోస్టల్, టెలిగ్రాఫ్ డిపార్టమెంట్‌తో పాటు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనలోనూ ప్రధానిగా ఒకటో సాలార్‌జంగ్ కొనసాగారు. దీంతో అభివృద్ధి ఎక్కడా ఆగలేదు.
అక్టోబర్ 8న తొలి రైలు పరుగులు
కర్ణాటకలోని బ్రిటీష్ రైల్వే జంక్షన్ వాడీని అనుసంధానం చేసేలా 1870లో సికింద్రాబాద్ టు వాడీ లైన్ పనులు మొదలయ్యాయి. 1874 నాటికి 115 మైళ్లు పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి 1874 అక్టోబర్ 8న తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలతో 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టింది.
ఆ నాటి ప్రధాన రైల్వే లైన్లు ఇవీ..
♦ హైదరాబాద్– కాజీపేట–బెజవాడ లైన్ 1891 నాటికి రెడీ అయ్యింది. దీంతో మద్రాస్ రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది.
♦ బొగ్గు రవాణాకు కోసం సింగరేణి పుట్టిల్లు ఇల్లెందుకు అప్పట్లోనే రైల్వే ట్రాక్ వేశారు.
♦ 1884లో నిజాం గ్యారెంటేడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది. తిరిగి 1930లో హైదరాబాద్ స్టేట్ ఆధీనంలోకి వచ్చింది.
♦ నిజాం స్టేట్ రైల్వేకు అనుబంధంగా గోదావరి వ్యాలీ రైల్వే ఉండేది. మహారాష్ట్రలోని మన్నామాడ్ లింక్ చేసే ప్రధాన లైన్ 1897లో మంజూరైంది. 1900లో హైదరాబాద్– మన్నమాడ్ మధ్య రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.
1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లన్నీ నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర, దక్షిణ భారత్‌తో కలిపే రైల్వేలైన్ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1950 నాటికి 2,353 కిలోమీటర్ల పట్టాలను నిజాం రైల్వే పరిచింది. నిజాం రైల్వే స్టేట్‌ను అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సెంట్రల్ రైల్వేలో విలీనం చేసింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా
మారిపోయింది.
నిజాంకు ప్రత్యేక రైలు
నిజాం పాలకులు ప్రయాణించేందుకు ఆనాడు ప్రత్యేక రైలు బోగీని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1904లో ఢిల్లీ దర్బార్‌కు ఈ ప్రత్యేక రైల్లోనే వెళ్లారు. ఇందులో నిజాం కోసం బెడ్‌రూమ్, కిచెన్, సెలూన్, బాత్‌రూమ్ ఉండేవి. సికింద్రాబాద్ గూడ్స్ రైలు గ్యారేజ్‌లో దీన్ని నిలిపేవారు.
నాంపల్లి రైల్వే స్టేషన్..
నాంపల్లి రైల్వే స్టేషన్ 1907లో మీర్ మహబూబ్‌అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. అయితే, 1921 వరకు ప్రయాణికులను అనుమతించలేదు. స్టేషన్‌ను గూడ్స్ రైళ్ల కోసం మాత్రమే వినియోగించేవారు. బొంబాయి తదితర ప్రదేశాల నుంచి వచ్చే సరుకులను దించేందుకు నాంపల్లి అనువుగా వాడేవారు.
♦ కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 1916లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే హెడ్ క్వార్టర్‌గా దీన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment