ఊరికి పోవుడెట్ల? | Hyderabad People Suffering With RTC Strike and Train Ticket Prices | Sakshi
Sakshi News home page

ఊరికి పోవుడెట్ల?

Published Tue, Oct 1 2019 10:24 AM | Last Updated on Fri, Oct 11 2019 1:02 PM

Hyderabad People Suffering With RTC Strike and Train Ticket Prices - Sakshi

కిటికీలో నుంచి ఎక్కుతున్న దృశ్యం

సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు రెగ్యులర్‌ రైళ్లలో రిగ్రేట్, ప్రత్యేక రైళ్లలో వందల్లో వెయిటింగ్‌ లిస్టు... మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల సమ్మె సైరన్‌... వెరసి పండగ ప్రయాణంపై అనిశ్చితి నెలకొంది. ఇదికాస్త దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న లక్షలాది మంది ప్రయాణికులను సందిగ్ధంలోకి నెట్టింది. తెలంగాణలోని  కొన్ని ప్రధాన పట్టణాలు మినహా మిగతా అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రైళ్లన్నీ నిండిపోయిన దృష్ట్యా బస్సులు తప్ప మరో గత్యంతరం లేదు. కానీ ఈ నెల  5 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 5,000 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రెగ్యులర్‌ బస్సులతో పాటు ప్రత్యేక  బస్సులు కూడా నడుపుతున్నారు. రెండు రోజులుగా సుమారు 500 బస్సులు అదనంగా నడిపినట్లు అధికారులు తెలిపారు.

ఆర్టీసీ అంచనా ప్రకారం 3–7 వరకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. నగరం నుంచి తెలంగాణ జిల్లాలు సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం 4, 5, 6 తేదీల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు అంచనా. అయితే సమ్మె అనివార్యమైతే 5వ తేదీ ఉదయం 5గంటల నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరం నుంచి ఊళ్లకు వెళ్లడమే కాదు... తిరిగి రావడం కూడా కష్టమే అవుతుంది. బతుకమ్మ, దసరా తెలంగాణలో ముఖ్యమైన వేడుకలు కావడంతో సిటీ నుంచి సుమారు 25లక్షల మందికి పైగా ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లనున్నారు. రెండు రోజుల క్రితమే పిల్లలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ మొదలైంది. సాధారణంగా ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 1.5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తారు. రెండు రోజులుగా 30వేల మంది అదనంగా వెళ్లినట్లు అధికారుల అంచనా. 

రైల్వే రిగ్రేట్‌...  
నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడల నుంచి ప్రతిరోజు 120 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మరో 100 ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్‌ నుంచి 85 ఎక్స్‌ప్రెస్‌లు వివిధ ప్రాంతాలకు  నడుస్తాయి. అయితే అన్ని రెగ్యులర్‌ రైళ్లలోనూ రిగ్రేట్‌ కనిపిస్తోంది. ఇక దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మధ్య సుమారు 150 సర్వీసులను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ సర్వీసుల్లోనూ వెయిటింగ్‌ లిస్టు 150–200 వరకు ఉంది. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప.. రద్దీని  ఎదుర్కోవడం కష్టం. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే రద్దీని దృష్టిలో ఉంచుకొని  మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లోని ప్రధాన పట్టణాలకు అందుబాటులో ఉండే విధంగా అదనంగా ప్యాసింజర్‌ రైళ్లను నడిపితే కొంతమేరకు ఊరట లభిస్తుంది. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు.

ఆర్టీఏ ఏర్పాట్లు... 
ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు రవాణాశాఖ  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది. ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను వివిధ రకాల వాహనాలకు ముఖ్యంగా ప్రైవేట్‌ బస్సులు, స్కూల్‌ బస్సులకు తాత్కాలిక పర్మిట్లను ఇవ్వనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. గ్రేటర్‌లో నడుస్తున్న 12,000 స్కూల్‌ బస్సులను ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు వినియోగిస్తామన్నారు. మరోవైపు ప్రాంతీయ రవాణా కార్యాలయాల వారీగా అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ వాహనాలు, డ్రైవర్లను ఇప్పటి నుంచే అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. 

‘కాచిగూడ’లో ప్లాట్‌ఫామ్‌ టికెట్ల ధర పెంపు
సాక్షి, సిటీబ్యూరో: దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్‌ 1 నుంచి 15 వరకు ఈ పెంపు వర్తిస్తుందన్నారు. ప్రయాణికుల కోసం వచ్చే వారి బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు తాత్కాలికంగా చార్జీలను (15 రోజుల పాటు) పెంచనున్నట్లు  తెలిపారు. ప్రయాణికులు గానీ వారు స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లపైకి రాకుండా ఉండడమే మంచిదని సూచించారు.    

బస్‌ బుకింగ్స్‌పై సమ్మె ఎఫెక్ట్‌..
హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖ, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలు, బెంగళూర్, చెన్నై తదితర దూరప్రాంతాలకు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ ఏసీ, నాన్‌ ఏసీ బస్సులపైన సమ్మె ప్రభావం ఇప్పటి నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు వీకెండ్, మరోవైపు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో పని చేస్తున్నవారు అక్టోబర్‌ 5 నుంచి పెద్ద ఎత్తున రాకపోకలు సాగించనున్నారు. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆ రోజు నుంచే సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా 5వ తేదీ కోసం ముందస్తుగా బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ సమ్మె తప్పనిసరైతే ఆర్టీసీనే స్వయంగా బుకింగ్‌లను నిలిపివేసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement