అక్ర‘మార్కులు’ | 16 members got jobs with fake certificate | Sakshi
Sakshi News home page

అక్ర‘మార్కులు’

Published Thu, Jul 24 2014 1:14 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

16 members got jobs with fake certificate

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాల తంతు బట్టబయలైంది. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాల పొందిన తీరు స్పష్టమైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 47 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం గతేడాది నోటిఫికేషన్ జారీచేసి భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. అయితే ఈ క్రమంలో 16 మంది అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించారు.

ఈ అక్రమాలను గుర్తించని అధికారులు.. సరిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి వారికి ఉద్యోగాలిచ్చారు. అయితే నకిలీ సర్టిఫికెట్ల సమర్పణతో ఉద్యోగాలు పొందిన వైనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘బోగస్.. జాబ్స్’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఉలిక్కిపడిన యంత్రాంగం అక్రమాలను తేల్చేందుకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. తాజాగా ఆ కమిటీ జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించింది. ఇందులో 10మంది అభ్యర్థుల జాతకాలు బయటపెట్టిన కమిటీ సభ్యులు, మరో ఆరుగురి లెక్క తేల్చేపనిలో ఉన్నారు.

 బోగస్ సర్టిఫికెట్లతో..
 బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అభ్యర్థి ఐదు, ఏడో తరగతి మార్కులకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేపట్టారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ల తంతుకు తెరలేపారు. జిల్లాలోని పలు మండలాల్లోని పాఠశాలల నుంచి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వాటిని యంత్రాంగానికి సమర్పించారు. ఒక్కో అభ్యర్థికి మొత్తం 600 మార్కులకు గాను 595, 594, 593, 592, 591.. ఇలా 16 మంది 97శాతానికి పైగా మార్కులు వ చ్చినట్లు సర్టిఫికెట్లు సృష్టించి దరఖాస్తు చేశారు.

అయితే సరైన  పరిశీలన చేపట్టకుండా అధిక మార్కులు సాధించినందున జిల్లా యంత్రాంగం వారికి ఉద్యోగాలు కట్టబెట్టింది. ఇందులో పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో సైతం చేరారు. తాజాగా 10 మంది అభ్యర్థుల అక్రమాలకు సంబంధించి విచారణ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో వారిపై జిల్లా యంత్రాంగం అతిత్వరలో వేటు వేయనున్నట్లు సమాచారం.

 సూత్రదారులు.. పాత్రదారులు
 నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ‘సాక్షి’ కథనం వెలువడిన అనంతరం బోగస్ అంశాన్ని తేల్చాలంటూ జిల్లా యంత్రాంగం విద్యాశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి బోగస్ అభ్యర్థుల సర్టిఫికెట్ల అంశాన్ని పరిశీలించి స్పష్టత ఇవ్వాలంటూ ఆయా మండల విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు.

అయితే పరిశీలన పూర్తిచేసిన ఎంఈఓలు అక్రమాలు జరగలేదని, ఆ సర్టిఫికెట్లు సరైనవేనని సమాధానం ఇచ్చారు. దీంతో సంతృప్తిచెందని యంత్రాంగం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. కమిటీ సభ్యులు లోతుగా పరిశీలించి అక్రమాలపై నిగ్గుతేల్చారు. ప్రస్తుతం 10 అభ్యర్థులు వివరాలతో కూడిన నివేదికను సమర్పించారు. మరో ఆరుగురు అభ్యర్థుల వ్యవహారంపై త్వరలో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలతోపాటు స్థానిక అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తొలిసారి పరిశీలన దారిమళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. మొ త్తంగా కలెక్టర్ నిర్ణయంతో ఈ అధికారులపైనా వేటుతోపాటు క్రిమినల్ కేసులు సైతం నమోదుచేసే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement