16 ఏళ్ల అమ్మాయికి గుండెపోటు
వాజేడు : పదహారేళ్ల ప్రాయం.. ఎన్నో ఉన్నత చదువులు చదవాలనుకుంది. పదవ తరగతి 8.7 జిపిఏతో పాసైంది. ఇంటర్లో చేరడానికి సిద్దమవుతోంది. ఇంతలోనో విధి వక్రీకరించింది. గుండెపోటు రూపంలో ఆమెను బలితీసుకుంది. ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.
వాజేడు మండలంలోని జంగాలపల్లికి చెందిన గజ్జల మల్లక్క, గజ్జల సమ్మయ్య దంపతుల కూతురు గజ్జెల నాగేంద్రమణి (16). స్థానిక వాజేడు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివింది. ఆదివారం రాత్రి ఛాతి ఎడమ వైపున నొప్పి వస్తుందని చెప్పడంతో తల్లి దండ్రులు హుటా హుటిన వాజేడు వైద్య శాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. దాంతో రాత్రికి రాత్రే వరంగల్ ఎంజిఎంకు తరలించారు.
ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. గత సంవత్సరం నాగేంద్ర మణికి అనారోగ్యం చెయ్యడంతో ఆరోగ్య శ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. కాని స్థానికంగా వైద్యం చేయించడంతో తగ్గింది. దీంతో అప్పటి నుంచి పెద్దగా పట్టించుకోలేదు. గత నెల రోజుల ముందు ఎడమ వైపు నొప్పి రావడంతో హైద్రాబాద్ లోని ఒక ప్రయివేట్ వైద్య శాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిక్షలను నిర్వహించి ఊపిరి తిత్తుల్లో నిమ్ము చేరిందంని తెలిపి మందులను ఇచ్చారు. నెల రోజుల తరువాత మల్లీ రావాలని సూచించారు.
ఆ తర్వాత నెల దాటినా నాగేంద్ర మణిని వైద్యం కోసం హైద్రాబాద్‌కు తీసుకెళ్లలేకపోయారు. తెచ్చిన మందులు కూడా అయిపోయాయి. ఆదివారం రాత్రి వచ్చిన నొప్పితో ప్రాణం పోయింది. గుండ పోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్టు తండ్రి సమ్మయ్య తెలిపాడు. సమ్మయ్య, మల్లక్కలకు గతంలో ఇద్దరు అబ్బాయిలు పుట్టిన ఆరు నెలకే చనిపోయారు. ఈమె మూడవ సంతానం ఒక్కతే కూతురు కావడంతో తల్లి దండ్రుల రోధన వర్ణనాతీతం. విద్యార్ధ్ని మృతి పట్ల విద్యార్ధులు, ఉపాద్యాయులు సంతాపం ప్రకటించారు.