
మాదాపూర్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ‘లూ–కేఫే’ సక్సెస్ కావడంతో నగరంలో మరో 180 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించింది. వీటిల్లో ఎయిర్ కండీషనర్ కేఫే, రెస్ట్‌రూం, న్యాప్కిన్ వెండింగ్ మిషన్, టాయిలెట్ తదితర వసతులున్నాయి. దీంతో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో నూతనంగా మరో 180 లూ–కేఫేలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఏర్పాటు చేసిన లూ–కేఫేలకు లభిస్తున్న స్పందనతో నగరవ్యాప్తంగా మరో 180 కొత్త లూ–కేఫేలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలో 36, కూకట్‌పల్లి జోన్ పరిధిలో 22, చార్మినార్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్‌ల పరిధిలో 30 చొప్పున ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.
నగరంలో మరిన్ని టాయిలెట్లు అందుబాటులో తేవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం విదితమే. దేశంలోనే స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందిన ఇండోర్‌లో లూ–కేఫ్‌లు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తీరుపై ఆధ్యయనం చేసేందుకు ఇటీవల నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డిలతో పాటు జీహెచ్‌ఎంసీ సీనియర్ అధికారులు ఇండోర్‌లో పర్యటించారు. అక్కడ నగరవాసులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అదే తరహాలో జీహెచ్‌ఎంసీపై ఏ విధమైన ఆర్థిక భారంలేకుండా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్దతిన లూ–కేఫేలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను నగరంలో 2515 చదరపు అడు గుల స్థలాన్ని కేటాయించి, నీటి సరఫరా సీవరేజి లైన్‌ల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
రూ.20 కొనుగోలు చేస్తే ఫ్రీ...
లూ–కేఫేలో రూ.20 విలువైన వస్తువులు కొనుగోలు చేసిన వారికి ఇందులోని టాయిలెట్లు ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తారు. ఏమీ కొనుగోలు చేయనివారు, రూ.20 లోపు కొనుగోలు చేసే వారు మాత్రం టాయిలెట్‌లను ఉపయోగించుకునేందుకు రూ. 5 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు, దివ్యాంగులకు ఉచితం. అయితే అందరూ ఉచితంగా ఈ లూ–కేఫేను పయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పించాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. ఇప్పటికే టాయిలెట్ల నిర్వహణ రంగంలో అనుభవం కలిగి ప్రధాన కూడళ్లు, రైల్వే, బస్‌స్టేషన్ల, ఎయిర్‌పోర్టు, మార్కెట్ మాల్స్‌లలో నిర్వహించే వారికి టెండర్లలో పాల్గొనేందుకు ప్రాధాన్యం కల్పించారు. అయితే, ఈ టెండర్లలో పాల్గొని విజయవంతంగా దక్కించుకున్న టెండరుదారు జీహెచ్‌ఎంసీ నిర్థారించిన విధానాన్ని అనుసరించి వార్షిక ఫీజు, అడ్వర్టయిజ్‌మెంట్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి ఈ టెండర్ల ప్రక్రియ నిర్దారించింది.
లూ–కేఫేలో సౌకర్యాలు ఇలా
♦ పూర్తిగా ఎయిర్ కండీషన్
♦ న్యాప్కిన్ వెండింగ్ మిషన్లు
♦ న్యాప్కిన్ ఇన్‌సినరేటర్
♦ కిడ్స్ డైపర్ చేంజింగ్ రూం
♦ కేఫే
♦ వైఫై సౌకర్యం
♦ వాటర్ ఏటీఎం
♦ బ్యాంకు ఏటీఎంలు