సాక్షి, హైదరాబాద్ : ఆదిలో దిగాలు పరిచిన కృష్ణమ్మ.. రెండున్నర నెలలు ఆలస్యంగానైనా ఉరకలెత్తుతోంది. కృష్ణా, తుంగభద్ర, బీమా, హంద్రీ పరీవాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద ఉధృతి పెరిగింది. జలాశయంలోకి 1,83,076 క్యూసెక్కులు చేరుతున్నాయి.
బీమా పరీవాహక ప్రాంతం నుంచి దిగువకు వదిలిన 87 వేల క్యూసె క్కులు శనివారం కృష్ణాకు చేరనుండటంతో శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి 1.12 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 107.. ఎడమ గట్టు కేంద్రం ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 47 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో.. నాగార్జునసాగర్‌లోకి 1,57,998 క్యూసెక్కుల ప్రవా హం చేరుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 11 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 1,310 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,054 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
గతేడాదికన్నా 49 టీఎంసీలు తక్కువ
గతేడాది అక్టోబర్ 13 నాటికి శ్రీశైలం జలాశయంలోకి 342.976 టీఎంసీల ప్రవాహం రాగా.. ఈ ఏడాది 293.126 టీఎంసీలు వచ్చాయి. అంటే.. గతేడాదికన్నా 49.850 టీఎంసీలు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. గతేడాది సెప్టెంబర్ ఆఖరు నాటికే కృష్ణాలో ప్రవాహం కనిష్టానికి చేరుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో నదికి గరిష్ట వరద ప్రవాహం వస్తోంది. మరో 20 రోజు లు వరద కొనసాగే అవకావం ఉండటంతో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీటి లభ్యత పెరిగొచ్చని చెబుతున్నారు.
గంటగంటకూ పెరుగుతున్న వరద
కృష్ణా, బీమా, తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలోకి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఇప్పటికే 884.4 అడుగుల్లో 212 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 534.2 అడుగుల్లో 178.07టీఎంసీల నీరుంది. నాగార్జున సాగర్ నిండాలంటే ఇంకా 135 టీఎంసీలు అవసరం.
కృష్ణా, ఉప నదుల నుంచి మరో 15–20 రోజులు ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో 100 నుంచి 120 టీఎంసీల వరకు నీరొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం నిలకడగా సాగుతోంది. శుక్రవారం 5,121 క్యూసెక్కులు చేరడంతో.. పులిచింతలలో నీటి నిల్వ 13.47 టీఎంసీలకు చేరుకుంది. అది నిండేందుకు ఇంకా 32.30 టీఎంసీలు అవసరం.
సింగూరు గేట్ల ఎత్తివేత
పుల్‌కల్ (అందోల్): ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతితో శుక్రవారం సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గురువారం రాత్రి నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం వరకు నీటి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఎత్తిన గేట్లను మూసివేశారు.
శుక్రవారం ఉదయం మళ్లీ ఇన్‌ఫ్లో పెరగటంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి 24,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నష్టపోకుండా ఉండేందుకు 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సింగూరు నుంచి నిజాంసాగర్‌కు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే నాలుగు రోజులుగా 1.50 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, లోతట్టు గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment