సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లకు గాను 1,86,17,091 (62.69 శాతం) మంది ఓటేశారు. 1,49,19,751 మంది పురుష ఓటర్లలో 93,73,320 (62.82శాతం) మంది, 1,47,76,024 మంది మహిళా ఓటర్లలో 92,42,193 (62.55శాతం) మంది, 1,504 మంది ఇతర (ట్రాన్స్‌జెండర్) ఓటర్లలో 232(15.43శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికంగా నమోదు కావడంతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లో పురుష ఓటర్లే స్వల్ప ఆధిక్యతను సాధించారు. రాష్ట్రస్థాయిలో సగటున స్త్రీ, పురుషుల ఓటింగ్ నిష్పత్తి సమానంగా నమోదు కావడం గమనార్హం.
ఇందూరులో పోటెత్తిన మహిళా ఓటర్లు
నిజామాబాద్ స్థానంలో మొత్తం 10,61,124 ఓట్లు పోలవ్వగా, అందులో 4,73,673 మంది పురుషులు, 5,87,447 మహిళలు, నలుగురు ఇతరులున్నారు. పురుషుల ఓటింగ్ 64.22 శాతం, మహిళల ఓటింగ్ 72.06 శాతం నమోదైంది. పురుషుల కంటే 1,13,774 మహిళా ఓట్లు అధికంగా పడ్డాయి. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి ధర్మవురి అరవింద్ పోటీలో ఉన్నారు.
ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన రైతన్నలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో 5,58,352 (68.49%) మంది పురుషులు, 5,88,108 (70.38%) మంది మహిళలు ఓటేయడంతో ఇక్కడి ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment