అమరుల త్యాగం అజరామరం | 19 years compleat Naxals attack on police in papannapeta | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగం అజరామరం

Published Sat, Oct 21 2017 2:19 PM | Last Updated on Sat, Oct 21 2017 2:19 PM

19 years compleat Naxals attack on police in papannapeta

పాపన్నపేట(మెదక్‌): శాంతిభద్రతల పరిరక్షణే వారి లక్ష్యం.. ప్రజా శ్రేయస్సే వారి ధ్యేయం.. అందుకు ఎంతటి త్యాగానికైనా వెరవని ధైర్యం వారి సొంతం. ఈ క్రమంలో కంటిమీద కునుకు లేకుండా విధులు నిర్వహిస్తూ.. నక్సల్స్‌ దాడిని ప్రతిఘటించేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి నేలకొరిగారు ఐదుగురు పోలీసులు. ఆ అమరుల త్యాగం అజరామరం అంటూ ఈ ప్రాంతంలో కొనియాడుతున్నారు. ఈ సంఘటన జరిగి 18 ఏళ్లు అవుతున్నా నేటి పోలీసులకు దశా దిశ నిర్దేశిస్తున్నాయి. మంజీరా గలగలల మధ్య.. పచ్చని పంట పొలాలకు నిలయం పాపన్నపేట మండలం. ప్రశాంతమైన వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో నక్సల్స్‌ వ్యూహాత్మకంగా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌ను టార్గెట్‌ చేసి పోలీసులను బలిగొనేందుకు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. నెల రోజులపాటు రెక్కీ నిర్వహించినా పాపం పసిగట్ట లేకపోయారు పోలీసులు.

పోలీసుల పాలిట కాళరాత్రి
అది 13 సెప్టెంబర్‌ 1999. అర్ధరాత్రి 1.10 నిమిషాలు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న నలుగురు పోలీసులు పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా సెంట్రీ విధుల్లో ఉన్న పోలీసు ఎప్పటిలాగే కాపలా కాస్తున్నారు. అంతలోనే మూడు దళాలుగా విడిపోయిన దాదాపు 75 మంది నక్సల్స్‌ ఠాణాపై మెరుపు దాడికి దిగారు. స్టేషన్‌లోకి దూసుకొచ్చిన జీపు సెంట్రీ పోస్టు వద్ద ఆగగానే సాయుధులైన నక్సల్స్‌ సెంట్రీ ప్రసాద్‌పై తూటాల వర్షం కురిపించారు. ఆ కాల్పులకు ఆయన శరీరం జల్లెడలా మారింది. లోపలి పోలీసులు తేరుకునే లోగానే లోనికి ప్రవేశించిన నక్సల్స్‌ విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో హెడ్‌కానిస్టేబుల్‌ ర ఘునందన్, కానిస్టేబుళ్లు నర్సింలు, రాంచందర్, ఆబిద్‌హుస్సేన్‌ల శరీరాలు రక్తపు ముద్దలయ్యాయి. 5 నిమిషాల వ్యవధిలోనే ఐదుగురు పోలీసులు బలయ్యారు. అయితే ఎస్సై సత్తయ్యను సైతం బంధీగా పట్టుకున్నప్పటికీ అదృష్టవశాత్తు ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు.

ఆత్మీయులకు దూరమై.. విధి నిర్వహణలో వీరులై
ఆలు బిడ్డలకు తీరని దుఃఖాన్ని పంచి.. కనిపెంచిన వారికి పుట్టెడు శోఖాన్ని మిగిల్చి అమరులయ్యారు పోలీసులు. వీరిలో ముగ్గురు 30 ఏళ్లలోపువారు కావడం దురదృష్టకరం. సంఘటన జరిగి 18 ఏళ్లు అవుతున్నా అమర వీరులను తలుచుకుంటూ వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. నాన్నల ప్రేమలను తలుచుకుంటూ వారి పిల్లలు.. మూడు పదులకే తెగిన తాళులను చూసి వారి భార్యలు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. చనిపోయిన పోలీసు కుటుంబాలకు డిపార్ట్‌మెంటు నుంచి ఉద్యోగాలు వచ్చినా.. కొంత ఆర్థిక సహాయం చేసినా జరిగిన నష్టం మాత్రం ఎవరూ తీర్చలేనిదనేది కాదనలేని సత్యం.  

సంగారెడ్డి క్రైం: శాంతిభద్రతల విషయంలో ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని అ«ధికారికంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంస్మరణ దినం ఘనంగా నిర్వహించేందుకు పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అమరులైన పోలీస్‌ సిబ్బంది, ఆయా కుటుంబాల స్థితిగతులపై ప్రత్యేక కథనం..

జిల్లాలో అమరులైన పోలీసులు వీరే..
1992లో సంఘ విద్రోహశక్తుల కాల్పుల్లో కానిస్టేబుల్‌ ఎల్లయ్య విధి నిర్వహణలో మృత్యువాతపడ్డారు. నిజామాబాద్‌ జిల్లా పిట్లం వద్ద సీపీఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ 1992న సిర్గాపూర్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో బి.జంగయ్య ప్రాణాలు కోల్పోయారు.
2007లో సంఘ విద్రోహశక్తులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌ ఆర్‌.సత్యనారాయణ మృతి చెందాడు. అసాంఘీక శక్తుల కాల్పుల్లో జె.సురేష్‌ 2010లో మృతి చెందాడు.  

వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు..
సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ శివకుమార్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 20 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టారు. అదే విధంగా రక్తదాన శిబిరంతోపాటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం, పోలీసు సిబ్బంది కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పరేడ్‌ గ్రౌండ్‌లో సంస్మరణ దినం
ప్రజాసేవలో ప్రాణాలర్పించిన పోలీసులకు ఘన నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు త్యాగం గొప్పది– అమర వీరుల కుటుంబాలకుప్రభుత్వం అండ –  ఏసీపీ నర్సింహారెడ్డి
సిద్దిపేటఅర్బన్‌: పోలీసులు విధి నిర్వహణలో ఏ మాత్రం పొరపాటుగా ఉన్నా శాంతిభద్రతలు క్షీణిస్తాయని, సమస్యలు, సవాళ్లను అధిగమించి సమాజ రక్షణకు పాటు పడాలన్నదే పోలీసుల లక్ష్యమని సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి అన్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసులకు అండగా ఉండేందుకు పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో ముందుకెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21 పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏసీపీని ‘సాక్షి’ పలకరించగా ఆయన వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.. సిద్దిపేట జిల్లాలో కొంతమంది పోలీసులు అసాంఘిక శక్తులు, నక్సలైట్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

సమాజం కోసం వారు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. వారికి పోలీస్‌ శాఖ తరఫున సెల్యూట్‌ చేస్తున్నా. అమర వీరుల త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది వారి సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం గొప్ప విషయం. జిల్లాలో ఎనిమిది మంది పోలీసులు వివిధ సంఘటనల్లో అమరులయ్యారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి త్యాగాలను స్మరిస్తూ ఆ కుటుంబాలను సన్మానించుకుంటున్నాం. అమరులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్‌ 15 నుంచి 21 వరకు వారోత్సవాలు జరుపుతున్నారు. అందులో రక్తదాన శిబిరాలు, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఆయుధాలు, చట్టాలపై అవగాహన కల్పించడం. 2కే రన్, క్రికెట్‌ టోర్నీల్లాంటివి ఏర్పాటు చేసి ప్రజలకు వారి త్యాగాలను గుర్తు చేస్తున్నాం.  విధి నిర్వహణలో పోలీసులు పగలు, రాత్రిళ్లు పని చేస్తున్నారు. వారు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఇటీవల మానసిక ఒత్తిళ్లపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.

మానని గాయం ధర్మాసాగర్‌ ఘటన
నక్సల్స్‌ చేతిలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మృతి చెంది 26 ఏళ్లు పూర్తి
ఇంకా వెంటాడుతున్న జ్ఞాపకాలు

కౌడిపల్లి(నర్సాపూర్‌): నక్సల్స్‌ (రాడికల్స్‌) చేతుల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయి 26 ఏళ్లు గడిచిపోయాయి. నాటి ఘటన నేటికీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ బి. దామోదర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ ఎం. మల్లేశం విధి నిర్వహణలో ఉండగా మండలంలోని ధర్మాసాగర్‌ గ్రామంలో నక్సల్స్‌ జరిపిన కాల్పుల్లో బలయ్యారు. ఏప్రిల్‌ 4, 1991లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ దామోదర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ మల్లేశంలు పెట్రోలింగ్‌కు ధర్మాసాగర్‌ గ్రామానికి వెళ్లారు. గ్రామ సర్పంచ్‌ రాంరెడ్డి ఇంట్లో ఉండగా అక్కడికి రమేష్, జనార్ధన్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నక్సల్స్‌ వచ్చారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ వద్ద ఉన్న రివాల్వర్, స్టెన్‌గన్‌లు తీసుకుని పశువుల కొట్టంలో వారిని కాల్చిచంపారు. కానిస్టేబుల్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పుల్లో ఎద్దు సైతం మృతి చెందింది. సర్పంచ్‌ రాంరెడ్డిని సైతం చంపేందుకు నక్సల్స్‌ ప్రయత్నించగా అతడి భార్య వేడుకోవడంతో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. నక్సల్స్‌ తూటాలకు ఇద్దరు పోలీసులు అమర వీరులయ్యారు. ఆ జ్ఞాపకాలు ఇంకా మండలవాసులను వెంటాడుతూనే ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement