2న ఘనంగా సద్దుల బతుకమ్మ
10 వేల బతుకవ్ములతో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు
బతుకమ్మల నిమజ్జనానికి 8 ఘాట్లు
హైదరాబాద్: బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత తొలిసారిగా జరుగుతున్న బతుకమ్మ పండుగ ముగింపు(సద్దుల బతుకమ్మ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పండుగ కోసం ఇప్పటికే రూ. పదికోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో 25 వేల మంది మహిళలతో భారీ ఎత్తున ముగింపు వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పదివేల బతుకమ్మలు.., తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయా జిల్లాల ఔన్నత్యాన్ని చాటే శకటాల ప్రదర్శన, లేజర్ షోల వుధ్య వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం సచివాలయంలో దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. దసరా ముందురోజు నిర్వహించే ఈ బతుకమ్మల కోసం 350 క్వింటాళ్ల పూలను సవుకూర్చనున్నారు. ఇందుకోసం రూ. 60 లక్షల వ్యయం చేయనున్నారు. పదివేల బతుకమ్మలను పేర్చడానికి ఎల్‌బీ స్టేడియంలో 1,200 మంది మహిళలు పనిచేస్తారని, వీరికి ప్రభుత్వమే అన్ని సదుపాయలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ పాల్గొననున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద బుద్ధభవన్ వైపు బతుకమ్మల నిమజ్జనానికి ఎనిమిది ఘాట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
అక్టోబర్ రెండున ‘తెలంగాణ’ మాస పత్రిక..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక మాసపత్రికను తీసుకువస్తోంది. ఈ పత్రికకు ‘తెలంగాణ’ అని నామకరణం చేసినట్లు తెలిసింది. తొలి సంచికను అక్టోబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. దీనికి అష్టకాల రామ్మోహన్‌రావు సంపాదకులుగా వ్యవహరిస్తారని అధికారవర్గాల సమాచారం.