ప్రభుత్వాసుపత్రులకు 20 లక్షల ట్రెమడాల్‌ మాత్రలు | 20 lakh Tramadol tablets for government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రులకు 20 లక్షల ట్రెమడాల్‌ మాత్రలు

Published Tue, Mar 12 2019 3:32 AM | Last Updated on Tue, Mar 12 2019 3:33 AM

20 lakh Tramadol tablets for government hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా తీవ్రమైన నొప్పి లేదా శస్త్రచికిత్స అనంతరం బాధ నుంచి బయటపడడానికి ట్రెమడాల్‌ మాత్రలు వాడతారు. అది కూడా ప్రత్యేకంగా వైద్యుడు సూచిస్తేనే. అలాంటిది నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ)లో నెలల పిల్లలకు వ్యాక్సిన్‌ అనంతరం నొప్పి కోసం వాటిని వేయడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనికి ఎన్నెన్నో సాకులను వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెతుకుతున్నాయి. పారాసిటమాల్, ట్రెమడాల్‌ రెండూ ఒకేరకంగా ఉంటాయని, గందరగోళంలో ఏఎన్‌ఎంలు వేశారు కాబట్టి వారిని సస్పెండ్‌ చేశామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్‌ ఆఫీసర్‌ను, ఏఎన్‌ఎంలను సస్పెండ్‌ చేయడంపైనే దృష్టి పెట్టారు. కానీ ఆ మాత్రలు నాంపల్లి యూపీహెచ్‌సీకి ఎందుకు సరఫరా చేశారన్నది ఇప్పుడు వినవస్తున్న ప్రశ్న. వాస్తవంగా కొద్దిమొత్తంలో పంపిస్తే సరిపోయేదని, అలాంటిది 10 వేల ట్రెమడాల్‌ మాత్రలను నాంపల్లి ఆసుపత్రికి సరఫరా చేయాల్సిన అవసరమేంటో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఇదే విషయాన్ని కేంద్ర బృందం తన నివేదికలో ఎత్తిచూపింది.

ఆ మాత్రలు ఏకంగా 300 మిల్లీగ్రాములు ఉన్నాయి. నొప్పి ఉన్నవారికి కూడా ఈ స్థాయి పరిమాణంలో మాత్రలు ఇవ్వరు. అలాంటిది పిల్లల వార్డుల్లో ఇంతటి పరిమాణంలో మాత్రలు ఎలా సరఫరా చేశారని పలువురు వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30–40 మిల్లీగ్రాములుంటేనే మత్తు వస్తుందని, అలాంటిది 300 ఎంఎంలు ఎలా సరఫరా చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతేడాది రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు ఏకంగా 20 లక్షల ట్రెమడాల్‌ మాత్రలను సరఫరా చేశారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఇంతటి పరిమాణంలో సరఫరా చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో అంతుబట్టడంలేదు.  

రెండు, మూడేళ్ల వరకు కొద్దిగానే కొన్నాం: చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 
రెండు, మూడేళ్ల క్రితం వరకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కొద్ది మొత్తంలోనే ట్రెమడాల్‌ మాత్రలు కొనుగోలు చేసింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ట్రెమడాల్‌ మాత్రలను సరఫరా చేయడం జరిగింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ట్రెమడాల్‌ మాత్రలను తిరిగి వెనక్కు తెప్పిస్తున్నాం. 

కేంద్ర వైద్య జాబితాలో లేకున్నా..!
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ధారించిన మాత్రల జాబితాలో ట్రెమడాల్‌ లేదని, అలాంటి ది తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎందు కు ఈ మాత్రను కొనుగోలు చేసిందనే దానిపై ఇప్పు డు రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయిలో అంతర్గత విచారణ జరుపుతోంది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని సమాచారం. పైగా ట్రెమడాల్‌ను హెచ్‌షెడ్యూల్‌లో ఉంచాల్సింది పోయి, యూనివర్సల్‌ జాబితాలోకి ఎలా చేర్చారన్నది అంతుబట్టని ప్రశ్న. ఇలా నిబంధనలను ఎక్కడికక్కడ కాలరాసి ట్రెమడాల్‌ మాత్రలను ఇష్టానుసారంగా ఆసుపత్రులకు సరఫరా చేసే పనిలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మునిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని పక్క దోవ పట్టించి కొందరు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారు లు కంపెనీల కోసమే ఇలా చేశారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. 2016 వరకు ట్రెమడాల్‌ 300 మిల్లీగ్రాముల మాత్రలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాతే దీన్ని కొనుగోలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement