
24 నుంచి వరంగల్‌లో షర్మిల పరామర్శ యాత్ర
మొదటి విడతలో జిల్లాలో ఐదు రోజులు పర్యటన
32 కుటుంబాలకు పరామర్శ
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 24 నుంచి పరామర్శించనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతగా ఐదురోజుల పాటు ఈ పరామర్శ యాత్ర సాగుతుంది. 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
షర్మిల సోమవారం (ఈ నెల 24 వ తేదీ) ఉదయం 8.30 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరి శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా 11 గంటలకు చేర్యాల చేరుకొని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేరోజు మరో ఆరుగురు కుటుంబాలను పరామర్శిస్తారు. మొదటి రోజు 154 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. రెండోరోజు 25న మంగళవారం 78 కి.మీ ప్రయాణించి 7 కుటుంబాలను పరామర్శిస్తారు.
26న 82.5 కి.మీ ప్రయాణించి ఏడు కుటుంబాలను, 27న 68 కి.మీ ప్రయాణించి ఏడు కుటుంబాలను,28 చివరిరోజు 237 కి.మీ ప్రయాణించి నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ మొదటి విడత పరామర్శ యాత్రలో ఐదు నియోజవర్గాలను పూర్తిగా, రెండు నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటించి 32 కుటుంబాలను పరామర్శిస్తారు. ఐదురోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.
మొదటి రోజు రాత్రి బచ్చన్న పేట, రెండోరోజు రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో, మూడో, నాల్గవ రోజు రాత్రి వరంగల్ టౌన్‌లో బస చేస్తారు. చివరి రోజు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పరామర్శ యాత్రను పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
రాజన్న బిడ్డకు ఆశీర్వాదాలు
వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్రకు వస్తున్న వైఎస్సార్ తనయ షర్మిలకి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. రాజన్న బిడ్డని మనసారా ఆశీర్వదించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ అభిమానులకు వరంగ ల్ పెట్టిన కోట అని అన్నారు.