సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఓటరుగా నమోదు కోసం దాదాపు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు గడువు ముగిసే సమయానికి గ్రేటర్ పరిధిలో దాదాపు 4.20 లక్షల దరఖాస్తులందగా వీటిలో దాదాపు 2.50 లక్షలు కొత్తగా ఓటరు నమోదుకు సంబంధించిన(ఫారం–6) దరఖాస్తులున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటు హక్కు కోసం 1.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఓటర్ల నమోదు, సవరణల కోసం మొత్తం 1,77,983 దరఖాస్తులందగా అందులో కొత్తగా జాబితాలో పేరు నమోదు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో అసెంబ్లీ నియోజకవర్గానికి చిరునామా మార్పునకు సంబంధించి (ఫారం–6 ద్వారా) 1,34,535 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో చిరునామా మార్పునకుసంబంధించిన వారు పోను కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు లక్షా 34 వేల మంది ఉంటారని భావిస్తున్నారు. వీటిల్లో 92,271 మంది వ్యక్తిగతంగా ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదుకు దరఖాస్తులు అందజేయగా 44,264 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జాబితాలో పేరు తొలగింపు కోసం (ఫారం–7 ద్వారా) 6,202 మంది, పొరపాట్ల సవరణల కోసం( ఫారం–8 ద్వారా) 14,880 మంది, ఒకే నియోజకవర్గంలో ఇళ్లు మారిన వారు( ఫారం–8ఏ) 22,366 మంది దరఖాస్తుచేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 1,18,350 మంది వ్యక్తిగతంగా, 59,633 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాసులన్నింటి విచారణను అక్టోబర్ 4వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉన్నందున ఈనెలాఖరునాటికే పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఇందుకుగాను 380మంది బీఎల్‌ఓలు, 578 మంది సూపర్‌వైజర్లు, వీఆర్‌ఓలు ఆయా ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతారన్నారు. ఈ విచారణ పర్యవేక్షణకు ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ప్రత్యేకంగా నియమించామని పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లాలో రెండు లక్షలకు పైనే...
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల కార్యక్రమం ముమ్మరంగా సాగింది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 25 వరకు మొత్తం 2,24,821 దరఖాస్తులు అందాయి. జిల్లాలో అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారీగా స్పందన లభించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 19.87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment