సాక్షి, హైదరాబాద్: మెడికల్ అన్‌ఫిట్, విధి నిర్వహణలో మరణించిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలను ఏకమొత్తంగా చెల్లింపు, లేదా ప్రతి నెలా రూ.25 వేల భృతి చెల్లింపు ప్రతిపాదనలకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు త్వరలో సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయనుంది. సోమవారం సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి.. అక్టోబర్ 8న సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆమోదించింది. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ అన్‌ఫిట్, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగానికి బదులు రూ.5 లక్షలు చెల్లించేవారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఆదేశం మేరకు 2015 మార్చి నుంచి సింగరేణి యాజమాన్యం ఈ మొత్తాన్ని రూ.12.50 లక్షలకు పెంచింది. ఇటీవల కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.25 లక్షలు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగానికి బదులు ఎంఎంసీ (మంత్లీ మానిటరీ కాంపెన్సేషన్) కోరుకునే వారికి ఇప్పటివరకు రూ.15,172 చెల్లిస్తుండగా, ఇకపై రూ.25 వేలు చెల్లించాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అర్హత కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇకపై హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది. 18 ఏళ్ల లోపు వయసు పిల్లలున్న మహిళా ఉద్యోగులు రెండేళ్ల గరిష్ట కాలంపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకునేందుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏటా ఏప్రిల్ 14న జీతంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అధికారులకు 2014–15, 2015–16లో ప్రతిభ ఆధారిత ప్రోత్సాహకం చెల్లించడానికి అంగీకరించింది. కేసీఆర్ ఇచ్చిన హామీలను 22 రోజుల్లోనే ఆమోదించామని సంస్థ యాజమాన్యం తెలిపింది.
మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు 25 లక్షలు
Published Tue, Oct 31 2017 3:23 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment