ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు | .. 3 trillion budget proposal | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు

Published Tue, Feb 17 2015 12:54 AM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM

ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు - Sakshi

ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు

  • మూడింతలు పెరిగిన శాఖల అంచనాలు..
  •  అంతగా ఇవ్వలేమంటూ తలపట్టుకున్న ఆర్థిక శాఖ
  •  మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలంటూ సూచన
  •  అనుకున్నంత ఆదాయం తీసుకురాకపోతే ఎలా..!
  •  ‘రెవెన్యూ’ తెచ్చే శాఖలపై ఆర్థికశాఖ అసంతృప్తి
  •  రేపటితో ముగియనున్న బడ్జెట్ ముందస్తు చర్చలు
  • సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ. 3,00,000 కోట్లు..! ఇదేంటి మూడింతలు దాటిపోయిందని ఆశ్చర్యపోవద్దు... ఈసారి కేటాయింపుల కోసం వివిధ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనల మొత్తం ఇది. బడ్జెట్ ముందస్తు చర్చల్లోనే ఆర్థిక శాఖ దిమ్మతిరిగిపోయేలా ప్రభుత్వ విభాగాలన్నీ కోరికల చిట్టా విప్పాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకు పైగా నిధులు కావాలంటూ ప్రతిపాదనలు సమర్పించాయి. అంతేకాదు... ‘కొత్త రాష్ట్రం కావడంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే ఇంత భారీగా నిధులు ఇవ్వాల్సిందేనని కొసరు మెరుపూ ఇచ్చేశాయి..

    2015-16 సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారం కిందే కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని శాఖల మంత్రులతో విడివిడిగా బడ్జెట్‌పై ముందస్తు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న శాఖలు మినహా అన్ని శాఖలతో చర్చలు పూర్తయ్యాయి.

    ఈ సందర్భంగా దాదాపు శాఖలన్నీ ఆర్థిక శాఖకు తమ ప్రతిపాదనలను సమర్పించాయి. కానీ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకుపైగా నిధులు కావాలంటూ ఇచ్చిన ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ వర్గాలు విస్తుపోయాయి. అన్ని నిధులు ఇవ్వాలంటే ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుందంటూ తల పట్టుకున్నాయి.
     
    తగ్గాల్సిందేనన్న ఆర్థిక శాఖ..

    సాగునీటి రంగానికి రూ. 17,692 కోట్లు ఇవ్వాలని నీటి పారుదల శాఖ కోరగా... ఇంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్ల కంటే తక్కువకు తగ్గించి ప్రతిపాదనలు అందజేయాలని సూచించింది. కీలకమైన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) రూ. నాలుగు వేల కోట్లు కోరింది. విద్యుత్ శాఖ రూ. 12,600 కోట్లు కావాలని ప్రతిపాదించింది. గత ఏడాది విద్యుత్ శాఖకు ప్రభుత్వం రూ. 3,500 కోట్లు కేటాయించడంతో పాటు మరో రూ. 1,000 కోట్లను జెన్‌కోలో పెట్టుబడిగా పెట్టింది. దీనితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు కోరింది. కానీ అంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఇక పరిశ్రమల శాఖకు గత ఏడాది రూ. 830 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 2,300 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్‌అండ్‌బీ విభాగం సైతం గతం కంటే ఘనంగా రూ. 10,800 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
     
    ఆదాయమేదీ..?

    ఆదాయం తెచ్చి పెట్టాల్సిన శాఖలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై చర్చల సందర్భంగా ఆర్థిక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే... జనవరి వరకు రూ. 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల వ్యవధిలోనే కనీసం మరో రూ. 6,000 కోట్లు రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకొని సాధించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది. వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాల ద్వారానే రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం రావాల్సి ఉందని... లక్ష్య సాధనలో ఆ విభాగాలు వెనుకబడితే ఆదాయం బాగా తగ్గిపోతుందని చర్చల సందర్భంగా మంత్రి ఈటెల సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇబ్బడి ముబ్బడిగా నిధులు కావాలని కోరుతూ ప్రతిపాదనలిచ్చిన మిగతా విభాగాలు.. వీలైనంత కుదించి ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. బుధవారంతో బడ్జెట్‌పై ముందస్తు చర్చలు ముగియనున్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని శాఖలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.
     
    పన్ను వసూళ్ల కోసం రూ. 496 కోట్లు!


    చెక్‌పోస్టులు, తనిఖీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అధిక మొత్తాన్ని కేటాయించాలని వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక శాఖను కోరింది. రెండు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులతో పాటు ఏడు సరిహద్దు చెక్‌పోస్టుల నిర్మాణం, కమిషనరేట్ భవన నిర్మాణం, ఇతర వ్యయం కోసం రూ. 496 కోట్లు కేటాయించాలని కోరింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,373.30 కోట్లు కేటాయించాలంటూ అటవీ శాఖ ప్రతిపాదించింది.

    ఇప్పటికే భారీగా కోతలు..

    గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది నెలల కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రూ. లక్ష కోట్ల మార్కు దాటింది. భారీగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచుకోవడంతో వాస్తవ అంచనాలు పట్టుతప్పాయి. తీరా బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఆదాయ, వ్యయాలకు పొంతన లేని పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు అందకపోవడం, అదనంగా ఎంచుకున్న ఆదాయ మార్గాలు ఆచరణలో సఫలం కాకపోవటం, అప్పుల పరిమితి కూడా పెరగకపోవటంతో 2014-15 ఏడాది ఆదాయం రూ. 75 వేల కోట్లకు మించడం గగనంగా మారింది. మిగతా రూ. 25 వేల కోట్ల పైచిలుకుకు బడ్జెట్‌లో కోత అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మొదలైన రెండో బడ్జెట్ కసరత్తు అత్యంత ప్రాధాన్యంగా మారింది. దానికితోడు వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు చుక్కలు చూపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement