ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన సంఘటన మెదక్ పట్టణంలో గురువారం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మోహన్ మెదక్ పట్టణంలోని సాయిచంద్ర నర్సింగ్‌హోంకు వచ్చాడు.
పరీక్షలు చేసిన వైద్యులు సురేశ్ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంతపెద్ద పరిమాణంలోని రాయిని చూడలేదన్నారు. నీళ్లు సక్రమంగా తాగకపోవడం, మాంసహారం అధికంగా తీసుకోవడం, వంశపారంపర్యంగా కిడ్నీల్లో రాళ్లు వస్తుంటాయన్నారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు తెలిపారు.