
‘వడ’లిపోతున్నారు..!
- 32 మంది మృత్యువాత
- పాత వరంగల్ జిల్లాలో 17 మంది
- పూర్వ కరీంనగర్‌లో 9 మంది
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వడదెబ్బకు 32 మంది మృత్యువాత పడ్డారు. పాత వరంగల్ జిల్లా పరిధిలో 17 మంది మృ తిచెందారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో రావుల యాదమ్మ (52), పెద్దముప్పారంలో కొండ యాకయ్య (32), కురవి మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాలో బానోత్ శాలి(75), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎస్సీ రామ్‌నగర్ కాలనీలో దామెర దినకర్(7), ఖానా పురం మండలం కొత్తూరులో అంకేశ్వరపు రాములు(40), నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లిలో గొనే కేశవరెడ్డి(60) వడదెబ్బతో మృతిచెందారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సరిగొమ్ముల లక్ష్మయ్య (55), టేకుమట్ల మండలం రామక్రిష్ణపూర్(వి)లో గొడుగు రాములు (45), వెల్లంపలిలో తాడవేన రాజయ్య(60), తాడ్వాయి మండలంలోని కాటాపూర్‌లో మేడిశెట్టి సమ్మయ్య(50), మహదేవపూర్ మండలం సూరారంలో సానెం ఓదెమ్మ (70), వరంగల్ నగరంలో గాండ్ల అనసూర్య(70), వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చిలగాని చక్రపాణి(65), జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో తండ అండాలు (58) వడదెబ్బతో మృతిచెందారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో పి ల్లల మొండయ్య(60), కొండం బుచ్చయ్య (80), మహబూబాబాద్ మండలంలోని కం బాలపల్లిలో ఎండీ.హుస్సేన్‌బీ(74) మృతి చెందింది.
పాత కరీంనగర్ జిల్లాలో పది మంది మృతిచెందారు. రామడుగు మండలం వెదిరలో కట్ల సత్యనారాయణ (45), మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కిన్నెర బింద య్య (68), శంకరపట్నం మండలం మొలం గూర్‌లో కుక్కముడి కొంరయ్య, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన సంజన (5), హుజూరాబాద్ మండలం కందుగులలో గడ్డం లింగయ్య(68) మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లెలో ఈరవేన పోశాలు (80), అదే జిల్లాలోని ఎలిగేడు మండలంలోని బుర్హాన్‌మియాపేటలో దుబ్బాసి సంజీవ్(30), రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలో గవ్వలపల్లి బాలయ్య, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చిర్ర రాజయ్య (68) మృతిచెందిన వారిలో ఉన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడిలో మంజూలపురం పెద్దసాయారెడ్డి(52), కామారెడ్డి మండలం హాజీపూర్ తండా లో సబావత్ కిమిలీ(46) వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం బూర్గుపలిలో బోయిన భుజంగం(53), యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ లో మాజీ ఉప సర్పంచ్ బహదూర్ బాలప్ప (38) చనిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో బండ పద్మారావ్(60), మంచిర్యాలకు చెందిన చిలువేరు ప్రసాద్(35) మృతిచెందారు.
వడదెబ్బతో వధువు తల్లి మృతి: నిలిచిన పెళ్లి
కొత్తగూడెంక్రైం: వడదెబ్బతో వధువు తల్లి చనిపోవడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రామాంజనేయకాలనీకి చెందిన షేక్ సైదానీబేగం(65), షేక్ రజ్జబ్ హుస్సేన్‌లకు ముగ్గురు కూతుళ్లు. చిన్నకూతురు జకియాబేగంకు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చెం దిన హైమత్ పాషాతో పెళ్లి కుదిరింది. సోమవారం ఉదయం 11 గంటలకు వీరి పెళ్లి జరగా ల్సి ఉంది. సైదానీబేగం 2, 3 రోజులుగా పెళ్లికార్డులు పంపణీ చేస్తోంది. ఈ క్రమంలో ఆది వారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మరునాడు కన్నుమూసింది.
భానుడి దెబ్బకు కాలిపోయిన లారీ
చౌటుప్పల్(భువనగిరి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ లారీకి అకస్మాత్తుగా మంటలు అంటుకుని దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడకుడ గ్రామానికి లారీ పశువుల పేడతో వెళ్తోంది. ఎండ తీవ్రతతో పాటు పచ్చి పేడ కావడం వల్ల ఇంజన్ లారీ విపరీతంగా వేడెక్కింది. గమనించిన డ్రైవర్ చెన్నగోని సైదులు దండు మల్కాపురం వద్ద లారీని ఆపాడు. దిగి చూస్తుండగా ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి క్యాబిన్ అంతటికీ మంటలు వ్యాపించాయి. ఫైరింజన్ వచ్చి చల్లార్చగా, అప్పటికే లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.