
రూ.8 వేల కోట్ల భూముల కేసు..
♦ ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు
♦ ప్రైవేటు వ్యక్తులకు 323 ఎకరాల కేటాయింపు ఉత్తర్వులు కొట్టివేత
♦ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని సర్కారుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పొప్పాలగూడలోని రూ.8 వేల కోట్ల విలువ చేసే 323 ఎకరాల కాందిశీకుల భూములకు సంబంధించి జరుగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. రమేష్ పరశురాం మల్పానీ, మరికొందరికి భూములు కేటాయింపులో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రధాన భూ పరిపాలన కమిషనర్(సీసీఎల్‌ఏ) తన అధికార పరిధి దాటి వ్యవహరించారన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ.. ఆ కేటాయింపులను కొట్టేసింది. ఈ కేటాయింపులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పింది.
ఈ కేటాయింపులు చట్టవిరుద్ధమని, సీసీఎల్‌ఏ తన అధికార పరిధి విస్మరించారని, రికార్డుల్లోని వాస్తవాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కేటాయింపులు జరిపారని ఆక్షేపించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని భూ కుంభకోణంగా అభివర్ణించిన హైకోర్టు దీనిపై విచారణ జరపాలని, ఇందులో పాత్ర ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం 200 పేజీల తీర్పు వెలువరించింది.
2006 నుంచి కేసు విచారణ
తాము దేశ విభజన సమయంలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డామని, అందువల్ల తమకు పరిహారం కింద కొంత మొత్తంలో నిర్వాసిత వ్యక్తుల పరిహారం, పునరావాస చట్టం(డీపీసీఆర్) 1954 కింద భూములు కేటాయించాలని రమేష్ పరశురాం మల్పానీ తదితరులు 2003లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి సీసీఎల్‌ఏ అంగీకరిస్తూ వారికి రంగారెడ్డి జిల్లా పొప్పాలగూడ వద్ద 323 ఎకరాలు కేటాయించారు. దీనిని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం ఇటీవల తుది విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ పరశురాం మల్పానీ తదితరులకు జరిపిన కేటాయింపులు అన్యాయమని తెలిపారు. నిర్వాసితుల వారసుల హోదాలో 47 సంవత్సరాల తరువాత పరశురాం మల్పానీ భూ కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. నిర్వాసితుల చట్టం కింద పరశురాం పూర్వీకులకు పరిహారం చెల్లించడం జరిగిందని, వారికి ఎటువంటి పరిహారం పెండింగ్‌లో లేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ విషయాలన్నీ రికార్డుల్లో ఉన్నప్పటికీ, అప్పటి సీసీఎల్‌ఏ నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు జరిపారని తెలిపారు.
ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ కేటాయింపుల వెనుక కంటికి కనిపించని వ్యవహారాలు తెరవెనుక ఎన్నో జరిగాయని, విజ్ఞాపన పత్రాల ఆధారంగా ఇంత భారీ స్థాయిలో భూములను కేటాయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ కేటాయింపుల విషయంలో తెరవెనుక వ్యక్తులు కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించింది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా జరిపిన ఈ కేటాయింపులను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ భూములకు ధర్మకర్తగా ఉన్న ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.