హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో పలు కీలకమైన శాఖల్లో 39 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కీలకమైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నాగిరెడ్డికి అవకాశం లభించింది. ఒకదశలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు కూడా వినిపించింది. ఇదే పదవికి పోటీపడిన చందనాఖన్‌కు అసలు ఈ జాబితాలో చోటులేకపోవడం గమనార్హం. సీనియర్ ఐఏఎస్ లక్ష్మీపార్థసారథిని అప్రధానమైన పోస్టులో నియమించడం చర్చనీయాంశంగా మారింది. కీలకమైన పోస్టుల్లో మాత్రం సామర్థ్యం ఆధారంగా సీఎం కేసీఆర్ ఎంపిక చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శుల పోస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జరిగిన బి.వెంకటేశాన్ని ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకే పరిమితం చేయడం గమనార్హం.
27మంది ఐపీఎస్‌లకు కూడా..
తెలంగాణకు కేటాయించిన 27మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ రాష్ర్ట ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.