ఊళ్లో ఓటుంటేనే పోటీ.. | 3phase panchayat polls in Telangana from January 21 | Sakshi
Sakshi News home page

ఊళ్లో ఓటుంటేనే పోటీ..

Published Fri, Jan 4 2019 3:58 AM | Last Updated on Fri, Jan 4 2019 3:58 AM

3phase panchayat polls in Telangana from January 21 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడైన సర్పంచ్‌ పదవికి పోటీచేయాలంటే.. ఆ గ్రామంలో ఓటుహక్కు తప్పనిసరిగా కలిగుండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రకటన తేదీకి ముందే ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలని పేర్కొంది. ఎన్నికల ప్రకటన తేదీకి ముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిందే. దీంతోపాటుగా ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సర్పంచ్‌ ఎన్నికల బరిలో దిగవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వాటా 25% ఉన్న సంస్థల ఉద్యోగులు మాత్రం పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించిన అర్హతలు, అనర్హతలు సహా పలు అంశాలపై ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలు జారీచేసింది. 

అర్హతలు
►అభ్యర్థి కచ్చితంగా తను పోటీచేసే పంచాయతీలో సభ్యుడిగా ఉండాలి.
►అభ్యర్థి వయసు 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్లు నిండాయా? లేదా? అనే ప్రాతిపదికన వయసును లెక్కిస్తారు.
►ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో అభ్యర్థులు.. షెడ్యూల్డ్‌ తెగలు (తెలంగాణకు సంబంధించిన)గా ప్రకటించిన ఏదైనా ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి.
ఎస్సీ, బీసీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో పోటీ చేసే
►అభ్యర్థులు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్‌ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి.
►మహిళలతోపాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన వారు అన్‌–రిజర్వ్‌డ్‌ స్థానాలకు పోటీపడొచ్చు.
►రేషన్‌ డీలర్లు, సహకార సంఘాల సభ్యులు అర్హులే. 
►పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆర్టీసీ, సింగరేణి సంస్థల ఉద్యోగులు అర్హులే. ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో మేనేజింగ్‌ ఏజెంట్‌/మేనేజర్‌/కార్యదర్శులు తప్ప మిగిలిన ఉద్యోగులు అర్హులే.
రాష్ట్ర ప్రభుత్వ వాటా 25%లోపుగా ఉన్న సంస్థల ఏజెంట్‌/మేనేజర్‌/కార్యదర్శులు సైతంపోటీకి అర్హులే.

అనర్హతలు
►క్రిమినల్‌ కోర్టు ద్వారా శిక్ష పడితే సర్పంచ్‌ పదవికి పోటీచేసేందుకు అనర్హులు. కేసులో శిక్ష ముగిసిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది.
►మతిస్థిమితం లేనివారు, చెవిటి, మూగవారు.
► దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని(ఇన్‌సాల్వెన్సీ) వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు, ఇన్‌సాల్వెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారు.
►గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ లేదా ఏదైనా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్‌ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు.
►  ఏదైనా పారితోషికం పొందుతూ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్‌ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు.
►రాష్ట్ర ప్రభుత్వం వాటా 25% లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న కంపెనీలు లేదా కార్పొరేషన్‌ (సహకార సొసైటీ కాకుండా)లలో మేనేజర్, కార్యదర్శిగా పనిచేసే వారు.
►1973 నేరశిక్షాస్మృతి ప్రకారం మేజిస్ట్రేట్‌గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు.
►ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరంలో గ్రామపంచాయతీకి పడిన బకాయిని చెల్లించాలంటే బిల్లు/నోటీసులు అందుకుని.. గడువులోగా బకాయి చెల్లించని వారు.
►గ్రామ సహాయకునిగా (వీఆర్‌ఓ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, అధికారి, స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలో ఉద్యోగిగా ఉన్నవారు.
►పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో ఆఫీస్‌ బేరర్‌గా ఉండకూడదు.
►రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం సభ అనర్హులుగా ప్రకటించినవారు అనర్హులు.
►మత సంబంధ సంస్థల చైర్మన్, సభ్యులు అనర్హులు. 
►పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేం దుకు అంగన్‌వాడీ వర్కర్లు అనర్హులు
►నీటి వినియోగదారుల సంఘం సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

ఖర్చుల అకౌంట్‌ తప్పనిసరి
ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు నిమిత్తంప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి, అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేయడానికి కనీసం ఒకరోజు ముందుగా ఈ ఖాతా తెరవాలి. నామినేషన్‌ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి ఈ బ్యాంక్‌ ఖాతా వివరాలు తప్పకుండా తెలియజేయాలి. ఈ బ్యాంక్‌ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చుచేయాలి. తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు అభ్యర్థులు తప్పనిసరిగా ఎంపీడీఓకు వెల్లడించాలి.  దీనికితోడు గ్రామాల్లోని ఓటర్లు, ప్రజలు ఎవరైనా అభ్యర్థుల ప్రచార వ్యయం వివరాలు కోరితే వారికి వాటిని కచ్చితంగా సమర్పించాలని ఎస్‌ఈసీ సూచించింది. 

సున్నిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయా వర్గాలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి, వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయడం లేదా తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం ఆందోళన కలిగించే విషయమని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు సున్నితమైన ఇలాంటి ప్రాంతాలను ముందే గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉంది. 

సర్పంచ్‌కి 30,వార్డు సభ్యులకు20 గుర్తులు 
సర్పంచ్‌ అభ్యర్థులకుకేటాయించే ‘ఫ్రీ సింబల్స్‌’ఇవే 
ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పు–సాసర్, విమానం, బంతి, షటిల్‌కాక్, కుర్చీ, వంకాయ, నల్లబోర్డు, కొబ్బరికాయ, లేడీ పర్సు, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచము, పలక,  
టేబులు, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, వేణువు(పిల్లనగ్రోవి), ఫోర్కు, చెంచా

వార్డు సభ్యులకు కేటాయించే ‘ఫ్రీ సింబల్స్‌’ఇవే... 
నీళ్ల జగ్గు, గౌను, గ్యాస్‌ స్టౌ, స్టూలు, గ్యాస్‌ సిలిండర్, గాజుగ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్‌ యాంటెనా, గరాటా, మూకుడు, కెటిల్, విల్లు–బాణం, కవర్, హాకీ బ్యాట్‌–బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్, పోస్టుబాక్స్, విద్యుత్‌ స్తంభం

నోటాకూ గుర్తు.. 
పంచాయతీ ఎన్నికల్లో నన్‌ ఆఫ్‌ ద అబౌ(నోటా)కు కూడా గుర్తు కేటాయిస్తారు. నమూనా బ్యాలెట్‌ పేపర్‌పై కొట్టివేత మార్క్‌తో ఉన్నదే ఆ గుర్తు.

నేర చరిత్ర ప్రకటించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర కలిగి ఉంటే తప్పనిసరిగా వెల్లడించాల్సిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లతో పాటు నేర చరిత్రపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాగే పంచాయతీతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతో పాటు విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్వీయ ధ్రువీకరణ రూపంలో రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన నమూనాలో ఈ సమాచారాన్ని పొందుపరిచి ఇద్దరు సాక్షుల సంతకాలతో సమర్పించాల్సి ఉంటుంది. కేసు వివరాలు, సెక్షన్లు, నేర సంఘటన వివరాలు, కోర్టు పేరు, కేసు నంబర్, కేసు నమోదైన తేదీ, శిక్ష పడిందా.. అప్పీల్‌ చేశారా.. తదితర సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement