సాక్షి, పాలకుర్తి(రామగుండం): గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ ‘కీ’ ద్వారా చెల్లింపులు జరిపేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గతంలో గ్రామ పంచాయతీల్లో వినియోగించిన నిధుల విడుదల చెక్కుల రూపంలో ఉండేది. కొన్ని చోట్ల పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు దుర్వినియోగం చేస్తుండటంతో ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు సస్పెండ్‌కు గురికావడం, విచారణను ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అలాంటి అక్రమాలకు చెక్‌పెట్టి పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‘కీ’ పేరుతో కొత్త విధానాన్ని రూపొందించింది.
సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతో..
గతంలో పంచాయతీ నిధుల వినయోగం విషయంలో గ్రామ కార్యదర్శితోపాటు సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పించారు. దీంతో ఇద్దరి సంతకాలు సేకరించి డిజిటల్ ‘కీ’ల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సర్పంచులు, ఉప సర్పంచ్‌ల వివరాలు, వారి సంతకాలతో కూడిన ఫారంలను నింపి డిజిటల్ ‘కీ’ తయారీ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈబాధ్యతను ప్రభుత్వం ఓప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి పనులను నిర్వహిస్తోంది.
డిజిటల్‘ కీ’ ద్వారానే చెల్లింపులు..
పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతో చేపట్టే పనులకు ఇక నుంచి డిజిటల్ ‘కీ’ ద్వారానే చెల్లింపులు జరుపనున్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగి పంచాయతీ నిధుల స్వాహాకు చెక్ పడనుంది. తప్పుడు రికార్డులు, పనులు చేయకున్నా చేసినట్లు చూపే అవినీతి విధానానికి అడ్డుకట్టపడనుంది.
దొంగ సంతకాలు, ఫోర్జరీలు చేసి నిధులను స్వాహా చేసే యత్నాలకు తావులేకుండా ఉంటుందని, ఈవిధానం ద్వారా నిధుల చెల్లింపులు జరుగుతాయి, ఏపనికి ఎంత చెల్లించాలనే విషయాలు స్పష్టంగా రికార్డు చేసి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో పనులు చేయకుండానే నిధులు విడుదల చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి.
చెక్కులకు కాలం చెల్లినట్లే..
ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలల్లో నిధుల వినియోగానికి సంబంధించి చెక్కుల రూపంలో చెల్లింపులు జరిగేవి. ప్రతీ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరచి నిధులను ఖర్చు చేసేవారు. గ్రామ అభివృద్ధికి మంజూరైన నిధులను విడుదల చేసేందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఇద్దరు సంతకం చేసి ట్రెజరీ కార్యాలయానికి తీసుకెళితే అన్నీ సరిగాఉండి ఆమోదం పొందితేనే నిధులను విడుదల చేసుకునే అవకాశం ఉండేది.
అయితే కొందరు తప్పుడు వివరాలు సమర్పించి నిధులను కాజేసిన సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఇలా జరుగకుండా ఉండేందుకు ప్రస్తుతం చెక్కుల విధానాన్ని తొలగించి ఈ–కుభేర్ ద్వారా బ్యాంక్‌లకు వెళ్లకుండా డిజిటల్ ‘కీ’ల ద్వారా నేరుగా బ్యాంక్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుత 14వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేసుకోవాలంటే చెక్కు అవసరం లేదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను సరిపోల్చిచూసి, పంచాయతీ అధికారుల అనుమతి తర్వాత డిజిటల్ ‘కీ’ వస్తుంది. ఈ ‘కీ’లను ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించనున్నారు.
ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు..
జిల్లా వ్యాప్తంగా 223 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆన్‌లైన్ ద్వారా పనులు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రైడ్ లైసెన్స్‌లు, ఆస్తి మార్పిడి, లే అవుట్‌ల అనుమతులకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌లో చేపడుతున్నారు. ఈసేవలన్నీంటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని బాధ్యులుగా చేసి వారి సంతకాలను కూడా డిజిటల్ చేశారు. వీటితోపాటు జనన, మరణ, వివాహా ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామపంచాయతీల్లోనే జారీ చేయనున్నారు. ఈసేవలన్నీంటినీ ఆన్‌లైన్ ద్వారా అందిస్తుండటంతో అవినీతి, అక్రమాలకు చోటు ఉండదు. అదేవిధంగా నిధుల విడుదలలో డిజిటల్ ‘కీ’తో పాలన మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ సేవలతో మేలు
గ్రామ పంచాయతీల ద్వారా అందించే సేవలను ఆన్‌లైన్ విధానం ద్వారా అందుతుండటంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వారు ఇబ్బంది పడకుండా స్థానికంగా అనేక సేవలను సులభంగా అందించే వీలు ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణ అనుమతులు, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందవచ్చు.
–ఉదయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment