అతివేగం.. ప్రాణాలు తీసింది.. | 4 killed and 1 injured in the road accident | Sakshi
Sakshi News home page

అతివేగం.. ప్రాణాలు తీసింది..

Published Sat, May 19 2018 1:09 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

4 killed and 1 injured in the road accident - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

హైదరాబాద్‌: అతివేగం ఐదు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఐదుగురు స్నేహితులు విహార యాత్రకు వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతిచెందగా.. మరో యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరంతా 19 ఏళ్ల లోపు వారే.. అందివచ్చిన కొడుకులు చేదోడు వాదోడుగా నిలుస్తారన్న ఆ తల్లిదండ్రుల కలలు రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరైపోయాయి. 

కారు అద్దెకు తీసుకుని.. 
పోలీసుల కథనం ప్రకారం.. కృషికాలనీకి చెందిన భీంసేన్‌ తిరుపతమ్మల మూడో కుమారుడు రామారావు(18) పదో తరగతితో చదువు మానేసి క్యాటరింగ్‌ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు కుమారుడు ఉదయ్‌కిరణ్‌(19) అమలాపురంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పాండుబస్తీకి చెందిన పోలనాయుడు, సరస్వతిల కుమారుడు హేమసుందర్‌(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కృషికాలనీకే చెందిన నారాయణ, నిర్మల కుమారుడు కిరణ్‌(18) జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సాయిబాబా, వాణిల కుమారుడు గణేష్‌(19). వీరు ఐదుగురు ప్రాణ స్నేహితులు. శుక్రవారం వికారాబాద్‌లోని అనంతగిరి వెళ్లేందుకు వీరంతా ప్లాన్‌ వేసుకున్నారు. వీరికి కారు లేకపోవడంతో గచ్చిబౌలిలోని జూమ్‌క్యాబ్స్‌ నుండి హ్యుండయ్‌ ఐ20(టీఎస్‌07యూఎఫ్‌5592) కారును మూడు రోజులకు బుక్‌ చేసుకున్నారు. 

గాల్లోకి ఎగిరి.. పల్టీలు కొట్టి.. 
శుక్రవారం తెల్లవారుజామున 2:40 గంటలకు వికారాబాద్‌ వెళ్లేందుకు సాయిబాబానగర్‌ నుండి బాలానగర్‌ వైపు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జీడిమెట్ల డిపో సమీపంలోని డీపీ కాలనీ వద్ద గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. దాదాపు ఐదు మీటర్ల ఎత్తున గాల్లోకి ఎగిరిన కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టి 100 మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న రామారావు, పక్కసీట్లో కూర్చున్న ఉదయ్‌కిరణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

తీవ్రంగా గాయపడిన హేమసుందర్, గణేష్, కిరణ్‌లను స్థానికులు 108లో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. హేమసుందర్, గణేష్‌ చికిత్స పొందుతూ కన్నుమూయగా.. కిరణ్‌ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కారు వెనక సీట్లో కూర్చున్న కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు యువకులు మృతిచెందడంతో సాయిబాబానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. హేమసుందర్‌ తండ్రి పోలనాయుడు మృతిచెందడంతో తల్లి సరస్వతి కుమారుడిని చదివిస్తోంది. చదువు పూర్తి చేసుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చిన తీరు కంటతడి పెట్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement