తెలంగాణకే 4 వేల మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)ఉత్పత్తి చేసే తెలంగాణ పవర్‌పై డిస్కంలు వివరణ ఇచ్చాయి. ఆ విద్యుత్ తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో 4000మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మిం చతలపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ రాష్ట్రానికే చెందుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణకే అంకితమని స్పష్టం చేశాయి. ఎన్టీపీసీ, డిస్కంల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి కేటాయించే విద్యుత్ వాటాలను కేంద్రం నిర్ణయిస్తుందని పేర్కొన్న నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ మేరకు వివరణ ఇచ్చాయి.
తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ఎన్టీపీసీ ఈ విద్యుత్ ప్రాజెక్టును చేపట్టిందని డిస్కంలు తెలిపాయి. తొలి విడతగా రామగుండంలో ఎన్టీపీసీ 1600(2x800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు రం గం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పీపీఏపై విద్యుత్ రంగ నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు, సూచనలపై సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఎన్టీపీసీ ప్రాజెక్టుల విద్యుత్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) నిర్ణయిస్తుందని, రామగుండం ఎన్టీపీసీ తొలి దశ ప్రాజెక్టు విద్యుత్ ధరలను సైతం అదే సంస్థ ఖరారు చేస్తుందని వెల్లడించాయి. ఒప్పంద కాలం 25 ఏళ్లు ముగిసే నాటికి ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి వ్యయం ఎన్టీపీసీకి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టును తెలంగాణ డిస్కంలు బై అవుట్ చేసేలా పీపీఏలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, జర్నలిస్ట్ ఎం.వేణుగోపాల్‌రావు సూచించగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ ప్లాంట్లను బైఅవుట్ చేసేందుకు సీఈఆర్సీ నిబంధనలు అంగీకరించవని డిస్కంలు బదులిచ్చాయి.