National thermal power corporation
-
NTPC: భారతావనికి వెలుగు దివ్వె.. ఎన్టీపీసీ
పెద్దపల్లి/జ్యోతినగర్: భారతావనికి వెలుగు ది వ్వెగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) లిమిటెడ్ నేటితో 47 వసంతా లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సంస్థ దేశంలో 77 విద్యుత్ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. 1975 నవంబర్ 7న నామకరణం స్వాతంత్య్రం అనంతరం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. విద్యుత్ ప్రాజెక్టు పంపిణీ విధానం తమ ఆధీనంలో ఉండాలనుకుంది. విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి. మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చే యాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు విద్యుత్ కేంద్రం నిర్మించాలంటే సమయం పడుతుందని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దినదినాభివృద్ధి చెందుతూ.. ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతూ దినదినాభివృద్ది చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, విధానాలు, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్మెంట్ విధానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థ విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు.. ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్తోపాటు మొత్తంగా 77 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్ రంగంలో వేగవంతమైన ప్రగతి నమోదు చేసింది. ఇతర సంస్థలతో కలిసి వ్యాపారం.. ఒకప్పుడు కేవలం విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. జాయింట్ వెంచర్లతో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 2032 నాటికి, శిలాజ ఇంధనం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ యొక్క పోర్ట్‌ఫోలియోలో దాదాపు 30% ఉంటుంది. ఈ సంస్థ జాతీయ సామర్థ్యంలో 16.78% కలిగి ఉంది. ఎకనామిక్ టైమ్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యుత్తమ 50 కంపెనీల్లో గుర్తింపు పొందింది. -
తెలంగాణకే 4 వేల మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)ఉత్పత్తి చేసే తెలంగాణ పవర్‌పై డిస్కంలు వివరణ ఇచ్చాయి. ఆ విద్యుత్ తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో 4000మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మిం చతలపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ రాష్ట్రానికే చెందుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణకే అంకితమని స్పష్టం చేశాయి. ఎన్టీపీసీ, డిస్కంల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి కేటాయించే విద్యుత్ వాటాలను కేంద్రం నిర్ణయిస్తుందని పేర్కొన్న నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ మేరకు వివరణ ఇచ్చాయి. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ఎన్టీపీసీ ఈ విద్యుత్ ప్రాజెక్టును చేపట్టిందని డిస్కంలు తెలిపాయి. తొలి విడతగా రామగుండంలో ఎన్టీపీసీ 1600(2x800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు రం గం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పీపీఏపై విద్యుత్ రంగ నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు, సూచనలపై సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఎన్టీపీసీ ప్రాజెక్టుల విద్యుత్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) నిర్ణయిస్తుందని, రామగుండం ఎన్టీపీసీ తొలి దశ ప్రాజెక్టు విద్యుత్ ధరలను సైతం అదే సంస్థ ఖరారు చేస్తుందని వెల్లడించాయి. ఒప్పంద కాలం 25 ఏళ్లు ముగిసే నాటికి ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి వ్యయం ఎన్టీపీసీకి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టును తెలంగాణ డిస్కంలు బై అవుట్ చేసేలా పీపీఏలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, జర్నలిస్ట్ ఎం.వేణుగోపాల్‌రావు సూచించగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ ప్లాంట్లను బైఅవుట్ చేసేందుకు సీఈఆర్సీ నిబంధనలు అంగీకరించవని డిస్కంలు బదులిచ్చాయి. -
మెగా సోలార్ పార్క్!
తొర్మామిడిలో ఎన్టీపీసీ ప్రతినిధి బృందం స్థల పరిశీలన సౌర కాంతులకు జిల్లా వేదిక కానుంది. మెగా సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాను ఎంచుకుంది. బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న కేంద్ర సర్కారు సౌర విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సౌర విద్యుదుత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొనడంతో తెలంగాణ సర్కారు కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ), నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, విద్యుత్ వ్యాపార్ నిగమ్ (ఎన్వీవీ) సహకారంతో బంట్వారం మండలం తొర్మామిడిలో 300 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కును స్థాపించేందుకు ముందుకొచ్చింది. తొర్మామిడికి అనుబంధ గ్రామమైన బస్వాపూర్ సర్వే నంబర్ 263లోని భూములను తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం పరిశీలించింది. సోలార్ ప్యానెళ్లు అమర్చడానికి అనువుగా 1300 ఎకరాల విస్తీర్ణంలో భూమి లభించడం, గ్రామీణ ప్రాంతం కావడంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇది అనువైన ప్రాంత మని సూత్రప్రాయంగా నిర్ణయించింది. నాలుగైదు రోజుల్లో మరోసారి ఉన్నతస్థాయి బృందం సందర్శించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్ కొరత నుంచి గట్టెక్కేందుకు కేసీఆర్ సర్కారు పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) సోలార్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా కరెంట్ సమస్య నుంచి బయటపడవచ్చని అంచనా వేస్తోంది. కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్న రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో జవహర్లాల్ నెహ్రూ సోలార్ ఎనర్జీ మిషన్ కింద సోలార్ పార్కులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఆయా ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకంగా మారడంతో ఈ పథకం కింద మరిన్ని సోలార్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఒక్క మెగావాట్‌కు రూ.6.50 కోట్లు! ఒక్క మెగావాట్ సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చు రూ.6.50 కోట్లు. అంటే తొర్మామిడిలో ప్రతిపాదిస్తున్న సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లలో వెచ్చిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడో వంతు వాటా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమి, లైన్ ఏర్పాటును సమకూరుస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంట్‌ను సమీపంలోని 220/11 కేవీ సబ్‌స్టేషన్‌కు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకు కరెంట్‌ను సరఫరా అవుతుంది. అంతా సవ్యంగా సాగితే ఆరు నెలల్లోనే సౌర విద్యుత్ సరఫరా ప్రక్రియ మొదలుకానుందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఉద్యోగాలు
ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అర్హతలు: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ఎంటెక్(బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: గేట్ 2015 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: గేట్ స్కోరు ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 20 నుంచి జనవరి 19 వెబ్సైట్: http://www.ntpc.co.in/ సెయిల్ పశ్చిమ బెంగాల్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్పెషలిస్ట్స్/మెడికల్ ఆఫీసర్స్ విభాగాలు: ఫిజీషియన్, పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆక్యుపేషనల్ హెల్త్ పారా మెడికల్ స్టాఫ్ విభాగాలు: స్టాఫ్ నర్స్(ఫిమేల్) ట్రైనీ, స్టాఫ్ నర్స్(మేల్) ట్రైనీ, ఫార్మాసిస్ట్, ఎక్స్‌రే టెక్నీషియన్, పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అటెండెంట్ కం టెక్నీషియన్(బాయిలర్ ఆపరేషన్) ఆపరేటర్ కం టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్) అటెండెంట్ కం టెక్నీషియన్(ట్రైనీ)- డంపర్ ఆపరేటర్ అర్హతలు తదితర పూర్తి వివరాలకోసం నోటిఫికేషన్ చూడొచ్చు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 వెబ్సైట్: http://www.sail.co.in -
ఎన్టీపీసీ భారీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపైనా దృష్టిపెట్టింది. బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లనే కొంటామని, అందుకు తగినన్ని నిధులు ఉన్నాయని సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే... సోలార్ ప్లాంట్ల గురించి.... 12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే అండమాన్‌లోని పోర్ట్బ్లెయిర్లో మొదటిసారిగా 5 మెగావాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించాం. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ వద్ద మరో 5 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించాం. అదేవిధంగా రామగుండంతో పాటు ఒడిశ్సాలోని తాల్చేరు, ఉత్తరప్రదేశ్‌లోని ఉంచాహార్లో చెరో 10 మెగావాట్లు, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ వద్ద 50 మెగావాట్లు.. మొదలైనవి చేపడుతున్నాం. మొత్తంగా 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపై.... దేశంలో వివిధ దశల్లో ఉన్న ప్లాంట్ల కొనుగోలుపై దృష్టి పెడుతున్నాం. ఇందులో నిర్మాణం పూర్తై, నిర్మాణ దశలో ఉన్న వాటితో పాటు పాత విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. సుమారు 7 ప్లాంట్లపై దృష్టి సారించాం. ఇవన్నీ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లే. అయితే, ఏయే ప్లాంట్లు అన్న విషయాన్నీ ఇంకా ఈ సమయంలో బహిరంగపరచలేం. ఒక్కటి మాత్రం చెప్పగలను... బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తాం. ఇందుకు నిధుల కొరత సమస్య కాదు. గ్యాస్ సమస్యలపై... కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ సరఫరా తగ్గడం అందరికీ తెలిసిందే. మా మొత్తం సామర్థ్యం 42,500 మెగావాట్లలో గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 10%. గ్యాస్ కొరతతో వివిధ ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. కేవలం 8.47% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో నడుస్తున్నాయి. గ్యాస్ కొరతను తీర్చుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తాం. సొంతంగా గ్యాస్ బ్లాకులు ఉంటే ఎంతో ఉపయోగం. గ్యాస్ బ్లాకులను దక్కించుకునేందుకు నూతన అన్వేషణ విధానం(నెల్ప్) బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్నీ పరిశీలిస్తున్నాం. గ్యాస్ ధర పెరుగుదలతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. అలాంటి సమయంలో గ్యాస్ ఆధారిత విద్యు త్ చార్జీలను వినియోగదారులు భరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. సొంత బొగ్గు గనుల గురించి... ప్రస్తుతం మేం 50 మిలియన్ టన్నుల నుంచి 60 మిలియన్ టన్నుల మేరకు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటాం. సొంతంగా బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాం. జార్ఖండ్‌లో మాకు దక్కిన గనిలో బొగ్గు వెలికితీతకు అంతా సిద్ధంగా ఉంది. అయితే, స్థానిక సమస్యల కారణంగా బొగ్గును వెలికితీయలేకపోతున్నాం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందితే అది సాధ్యమవుతుంది. దీనిపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల విస్తరణపై.... ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విద్యుత్ ప్లాంట్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇందుకు మాకు అవసరమైన భూమి, నీరు ఉన్నాయి. అయితే, బొగ్గు సరఫరా ప్రధాన సమస్య. బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా వెంటనే చేపడతాం. విశాఖపట్నం సమీపంలో పూడిమడక వద్ద 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్లాంటుకు బొగ్గు సరఫరా లేదు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని ప్లాంటును నడిపేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగిలిన మూడు రాష్ట్రాలూ ఒప్పుకున్నాయి. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తాం. భూసేకరణ చేపట్టి ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. -
నేడో, రేపో విద్యుత్ ప్లాంట్ల మూత
సింహాద్రి, రామగుండంలో నిండుకున్న బొగ్గు 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ జెన్కో ప్లాంట్లకూ బొగ్గు ఇబ్బందులు తుపానులు, ఎంసీఎల్లో స్థానిక గొడవల ఫలితం అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)కి చెందిన రెండు విద్యుత్ ప్లాంట్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఎన్టీపీసీకి చెందిన ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఈ ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు కొరత కారణంగా తక్కువ సామర్థ్యంతో విద్యుత్‌ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు తుపానుతో పాటు ఒడిశాలో స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేని పోలీసులు అరెస్టు చేయడంతో మహానది కోల్ ఫీల్డ్స్(ఎంసీఎల్)లో శుక్రవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం కూడా బొగ్గు ఉత్పత్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీకి చెందిన రెండు ప్లాంట్లలో నేడో, రేపో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. రాష్ట్రంలో ఎన్టీపీసీకి విశాఖపట్నం సమీపంలోని 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహా ద్రితో పాటు రామగుండంలో 2,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ ఉంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుండటంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో) ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. జెన్కోకు చెందిన విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)తో పాటు వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ)లో ఐదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఇక వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)తో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో కూడా ఒక రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంసీఎల్ నుంచి ఎన్టీటీపీఎస్తో పాటు ఆర్టీపీపీకి కూడా బొగ్గు సరఫరా అవుతుంది. ఎంసీఎల్ నుంచి బొగ్గు సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ఆర్‌టీపీపీలోనూ ఒక రోజుకు సరిపడా నిల్వే ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల ప్రకారం పిట్ హెడ్ ప్లాంట్ల (బొగ్గు గని పక్కనే ఉండే విద్యుత్ ప్లాంట్లు)లో 12 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అలాగే బొగ్గు గనులకు దూరంగా ఉండే విద్యుత్ ప్లాంట్లలో 15 రోజులకు సరిపడే నిల్వలు ఉండాలి. ఈ లెక్కన రాష్ట్రంలో కొత్తగూడెం మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే బొగ్గు నిల్వలు ఉంచుకోవడంలో అధికారుల వైఫల్యం వల్లే ప్లాంటు మూతపడే పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి.