మెగా సోలార్ పార్క్! | Mega Solar Park in district | Sakshi
Sakshi News home page

మెగా సోలార్ పార్క్!

Published Sat, Nov 29 2014 11:36 PM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM

Mega Solar Park in district

తొర్మామిడిలో ఎన్‌టీపీసీ ప్రతినిధి బృందం స్థల పరిశీలన

సౌర కాంతులకు జిల్లా వేదిక కానుంది. మెగా సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాను ఎంచుకుంది. బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న కేంద్ర సర్కారు సౌర విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సౌర విద్యుదుత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొనడంతో తెలంగాణ సర్కారు కూడా సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.

ఇందులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ), నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, విద్యుత్ వ్యాపార్ నిగమ్ (ఎన్‌వీవీ) సహకారంతో బంట్వారం మండలం తొర్మామిడిలో 300 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కును స్థాపించేందుకు ముందుకొచ్చింది. తొర్మామిడికి అనుబంధ గ్రామమైన బస్వాపూర్ సర్వే నంబర్ 263లోని భూములను తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం పరిశీలించింది. సోలార్ ప్యానెళ్లు అమర్చడానికి అనువుగా 1300 ఎకరాల విస్తీర్ణంలో భూమి లభించడం, గ్రామీణ ప్రాంతం కావడంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇది అనువైన ప్రాంత మని సూత్రప్రాయంగా నిర్ణయించింది. నాలుగైదు రోజుల్లో మరోసారి ఉన్నతస్థాయి బృందం సందర్శించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్ కొరత నుంచి గట్టెక్కేందుకు కేసీఆర్ సర్కారు పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) సోలార్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా కరెంట్ సమస్య నుంచి బయటపడవచ్చని అంచనా వేస్తోంది. కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్న రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో జవహర్‌లాల్ నెహ్రూ సోలార్ ఎనర్జీ మిషన్ కింద సోలార్ పార్కులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఆయా ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకంగా మారడంతో ఈ పథకం కింద మరిన్ని సోలార్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఒక్క మెగావాట్‌కు రూ.6.50 కోట్లు!
ఒక్క మెగావాట్ సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చు రూ.6.50 కోట్లు. అంటే తొర్మామిడిలో ప్రతిపాదిస్తున్న సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లలో వెచ్చిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడో వంతు వాటా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమి, లైన్ ఏర్పాటును సమకూరుస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంట్‌ను సమీపంలోని 220/11 కేవీ సబ్‌స్టేషన్‌కు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకు కరెంట్‌ను సరఫరా అవుతుంది. అంతా సవ్యంగా సాగితే ఆరు నెలల్లోనే సౌర విద్యుత్ సరఫరా ప్రక్రియ మొదలుకానుందని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement