ఎన్టీపీసీ భారీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపైనా దృష్టిపెట్టింది. బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లనే కొంటామని, అందుకు తగినన్ని నిధులు ఉన్నాయని సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
వివరాలు ఆయన మాటల్లోనే...
సోలార్ ప్లాంట్ల గురించి....
12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌లో మొదటిసారిగా 5 మెగావాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించాం. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ వద్ద మరో 5 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించాం. అదేవిధంగా రామగుండంతో పాటు ఒడిశ్సాలోని తాల్చేరు, ఉత్తరప్రదేశ్‌లోని ఉంచాహార్‌లో చెరో 10 మెగావాట్లు, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ వద్ద 50 మెగావాట్లు.. మొదలైనవి చేపడుతున్నాం. మొత్తంగా 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపై....
దేశంలో వివిధ దశల్లో ఉన్న ప్లాంట్ల కొనుగోలుపై దృష్టి పెడుతున్నాం. ఇందులో నిర్మాణం పూర్తై, నిర్మాణ దశలో ఉన్న వాటితో పాటు పాత విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. సుమారు 7 ప్లాంట్లపై దృష్టి సారించాం. ఇవన్నీ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లే. అయితే, ఏయే ప్లాంట్లు అన్న విషయాన్నీ ఇంకా ఈ సమయంలో బహిరంగపరచలేం. ఒక్కటి మాత్రం చెప్పగలను... బొగ్గు లింకేజీ ఉన్న ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తాం. ఇందుకు నిధుల కొరత సమస్య కాదు.
గ్యాస్ సమస్యలపై...
కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాస్ సరఫరా తగ్గడం అందరికీ తెలిసిందే. మా మొత్తం సామర్థ్యం 42,500 మెగావాట్లలో గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 10%. గ్యాస్ కొరతతో వివిధ ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. కేవలం 8.47% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో నడుస్తున్నాయి. గ్యాస్ కొరతను తీర్చుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తాం. సొంతంగా గ్యాస్ బ్లాకులు ఉంటే ఎంతో ఉపయోగం. గ్యాస్ బ్లాకులను దక్కించుకునేందుకు నూతన అన్వేషణ విధానం(నెల్ప్) బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్నీ పరిశీలిస్తున్నాం. గ్యాస్ ధర పెరుగుదలతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది. అలాంటి సమయంలో గ్యాస్ ఆధారిత విద్యు త్ చార్జీలను వినియోగదారులు భరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న.
సొంత బొగ్గు గనుల గురించి...
ప్రస్తుతం మేం 50 మిలియన్ టన్నుల నుంచి 60 మిలియన్ టన్నుల మేరకు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటాం. సొంతంగా బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాం. జార్ఖండ్‌లో మాకు దక్కిన గనిలో బొగ్గు వెలికితీతకు అంతా సిద్ధంగా ఉంది. అయితే, స్థానిక సమస్యల కారణంగా బొగ్గును వెలికితీయలేకపోతున్నాం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందితే అది సాధ్యమవుతుంది. దీనిపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తున్నాం.
రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల విస్తరణపై....
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విద్యుత్ ప్లాంట్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇందుకు మాకు అవసరమైన భూమి, నీరు ఉన్నాయి. అయితే, బొగ్గు సరఫరా ప్రధాన సమస్య. బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా వెంటనే చేపడతాం.
విశాఖపట్నం సమీపంలో పూడిమడక వద్ద 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్లాంటుకు బొగ్గు సరఫరా లేదు. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని ప్లాంటును నడిపేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగిలిన మూడు రాష్ట్రాలూ ఒప్పుకున్నాయి. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తాం. భూసేకరణ చేపట్టి ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.