
5 గ్రామాల్లో రాహుల్ పర్యటన
11న హైదరాబాద్‌కు, 12న రైతు కుటుంబాలకు పరామర్శ
నిర్మల్‌లో 15 కిలోమీటర్ల పాదయాత్ర
రైతుల కష్టాలు పట్టని సీఎం కేసీఆర్: ఉత్తమ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 12న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. టీపీసీసీ నేతలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 11న సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు చేరుకుంటారని, విమానాశ్రయంలోనే ఓయూ విద్యార్థి నేతలు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమవుతారని చెప్పారు. అక్కడి నుంచి నేరుగా నిర్మల్‌కు వెళతారని తెలిపారు. 12న ఉదయం వడ్యాలలో ప్రారంభించే పాదయాత్ర రాచాపూర్, పొట్లపల్లి, లక్ష్మణచాందా, కొరటికల్ గ్రామాల మీదుగా సాగుతుందని వివరించారు. కొరటికల్‌లో పార్టీ శ్రేణులను, రైతులను ఉద్దేశించి సాయంత్రం 4 గంటలకు రాహుల్ ప్రసంగిస్తారు.
అక్కడి నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి రాత్రి 8.15కు ఢిల్లీకి బయలుదేరుతారని ఉత్తమ్ వెల్లడించారు. ఓవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్లీనరీలు, వేడుకల్లో మునిగితేలుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వ్యవసాయంపై నిర్లక్ష్యంతో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. బంగారు తెలంగాణకు బదులు ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో బాధల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, అన్నదాతల ఆక్రందనల తెలంగాణగా మారిపోయిందని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సమాజంలో సగానికిపైగా ఉన్న వెనుకబడినవర్గాలు తమ హక్కుల కోసం పోరాడాలని టీపీసీసీ ఓబీసీ సెల్ కార్యకవర ్గ సమావేశంలో ఉత్తమ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకివ్వలేదో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కాంగ్రెస్‌లోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.