పోయింది ఏడు కాదు 50 కేజీలు!
జహీరాబాద్ ‘ముత్తూట్’లో భారీ బంగారం చోరీ
ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుల నుంచి 20 కేజీలు స్వాధీనం
పట్టుబడింది ముగ్గురు దొంగ లే.. అత్యంత రహస్యంగా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో భారీ బంగారు దోపిడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50కేజీలు! గత నెల మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో దొంగలు కొల్లగొట్టిన బంగారం పరి మాణం ఇది. ఈ దొంగతనంలో పోయింది ఏడు కేజీలని ఇప్పటి వరకు భావిస్తుండగా అసలు విషయం తాజాగా వెలుగుచూసింది. కాజేసిన బంగారంలో ఇప్పటివరకు 20కేజీలు మాత్రమే పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. అత్యంత రహస్యంగా దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర పోలీసులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు దొంగల్లో ముగ్గురిని పట్టుకుని, రూ.10 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, మిగతా ముగ్గురు నింది తుల కోసం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
దొంగతనం ఇలా : జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో గత నెల 3న చోరీ జరిగింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు చెందిన దొంగల ముఠా 50కేజీల బంగారం, రూ.14 లక్షల నగదు ఎత్తుకుపోయింది. బెంగాల్‌కు చెందిన ఖమ్రుద్దీన్ జహీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. అక్కడి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో 9వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకున్నాడు.
పలుమార్లు రెక్కీ చేశాక చోరీ కోసం జార్ఖండ్‌కు చెందిన అశోక్‌శర్మ, యూసఫ్, వినోద్, కమల్‌సహా ఆరుగురితో కలిసి రంగంలోకి దిగాడు. దొంగలు గతనెల 2వ తేదీ రాత్రి ఖమ్రుద్దీన్ పనిచేసే అపార్ట్‌మెంట్ వద్ద తాత్కాలిక నివాసంలో బస చేశారు. 3వ తేదీ తెల్లవారుజామున గ్యాస్‌కట్టర్లు, గడ్డపారలు, ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డారు. ముత్తూట్ కార్యాలయం వెనుక భాగంలోని తలుపును తొలగించి లోనికెళ్లారు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, గ్యాస్‌కట్టర్ల సాయంతో స్ట్రాంగ్ రూమ్ ఏ-1లోని సేఫ్ లాకర్లను తెరిచి వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారం, నగదును సంచుల్లో సర్దుకున్నారు.
ఎంజీబీస్‌లో దొరికిన దొంగ
ఉదయం ఐదుగంటలకు ఆరుగురూ కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కి నేరుగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి, అట్నుంచి జార్ఖండ్ పారి పోవాలని పథకం వేశారు. ఎంజీబీఎస్‌లో ఆరోజు ఆర్టీసీ భద్రతా సిబ్బంది చేసిన తనిఖీల్లో అశోక్‌శర్మ పట్టుబడ్డాడు. అఫ్జల్‌గంజ్ పోలీసులు అతడిని విచారించేదాకా చోరీ గురించి ఎవరికీ తెలియలేదు. అశోక్‌శర్మను ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లి విచారించగా అసలు సంగతి బయటపడింది. 50కేజీలకు పైగా బంగారం చోరుల పాలైనట్లు పోలీ సులు నిర్ధారించారు. ఈ చోరీ సూత్రధారి ఖమ్రుద్దీన్ గత ఏడాది మార్చి 29న మెదక్‌జిల్లా కవేలీలోని సిండికేట్ బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ముఠాతో కలిసి యత్నించాడు. అలారం మోగడంతో ఘటనాస్థలికి వచ్చిన ఎస్సైపై కాల్పులు జరిపి అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి మరో ముఠాతో కలిసి ‘ముత్తూట్ చోరీ’కి పాల్పడ్డాడు.