టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 59.93% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 59.93% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ఫలితాలను పాఠశాల విద్యా ఇన్‌చార్జి కమిషనర్ విజయ్‌కుమార్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలు 6.27% అధిక ఉత్తీర్ణత సాధిం చారు. బాలురు 57.24% మంది ఉత్తీర్ణులవ్వగా, బాలికలు 63.51% ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు బాలురు 50,814 మంది హాజరుకాగా, 29,085 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 38,312 మంది హాజరుకాగా, 24,332 మంది ఉత్తీర్ణత సాధించారు. 87.33% ఉత్తీర్ణతతో వరంగల్ రూరల్ ప్రథమ స్థానంలో నిలువగా, 26.76% ఉత్తీర్ణతతో జనగామ చివరి స్థానంలో నిలిచింది. గతేడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలతో పోల్చితే ఈసారి 1.34% ఉత్తీర్ణత తగ్గింది’ అని అన్నారు. పరీక్షలకు 89,126 మంది హాజరవగా.. 53,417 మంది (59.93%) ఉత్తీర్ణులయ్యారు.
పది రోజుల్లో మార్కుల మెమోలు..
పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులకు 10 రోజుల్లో మార్కుల మెమోలను పంపిస్తామని విజయ్‌కుమార్ తెలిపారు. పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా పంపిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ఈ నెల 7 నుంచి 15లోగా ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో పోస్టు ద్వారా లేదా స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం సంబంధిత హెడ్‌మాస్టర్ సంతకం చేయించుకొని ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఈ నెల 7 నుంచి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలని, http://bse.telangana.gov.inలో దరఖాస్తు ఫారం నమూనాను ఉంచినట్లు తెలిపారు.