ఆవైపు సరే.. కాస్త ఈవైపూ చూడండి! | 70 percent special trains to the coastal area in 203 special trains | Sakshi
Sakshi News home page

ఆవైపు సరే.. కాస్త ఈవైపూ చూడండి!

Published Tue, Jan 15 2019 2:14 AM | Last Updated on Tue, Jan 15 2019 2:39 PM

70 percent special trains to the coastal area in 203 special trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ దృష్ట్యా కోస్తాకు ప్రత్యేక రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు ఈ సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు 203 ప్రత్యేక రైళ్లు వేయగా వాటిలో 70 శాతం కోస్తా ప్రయాణికుల కోసం కేటాయించారు. మరో వైపు తెలంగాణ వైపు ప్రయాణించే వారికోసం బస్సులే దిక్కవుతున్నాయి. ఇటు వైపు కూడా ప్రత్యేక రైళ్లను వేసి ఉంటే పండుగ వేళ ప్రయాణాలు సునాయాసంగా జరిగేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది తెలంగాణకు కనీసం 10 రైళ్లు నడిపి ఈసారి ఒక్క రైలైనా ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే 31 డెమూ రైళ్లను ఎందుకు ఎత్తేశారని నిలదీస్తున్నారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దాదాపుగా 203 రైళ్లు నడుపు తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఇందులో దాదాపుగా 141కిపైగా కోస్తా ప్రాంతాలకు వేశారు. ఇందులో విజయ వాడ, గుంటూరు, తాడేపల్లిగూడెం, సామర్ల కోట, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. వీటిలో 60 జన సాధారణ్‌ రైళ్లు ఉన్నాయి. వాటిలో 15 వరకు సాధారణ బోగీలే ఉన్నాయి. మరో 10 సువిధ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో ధరలు 300 నుంచి 400% అధికంగా ఉన్నాయి. సువిధ రైళ్లలో ధరల్ని చూసి ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. దీంతో 60 జన సాధారణ్‌ రైళ్లు కూడా ప్రత్యేక రైళ్లని ప్రకటించడంతో వీటిలో ఎక్కేందుకు ఎవరూ సాహసించడం లేదు. రోజుకు 4 రైళ్లు కోస్తాలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరుతున్నా... ఈ రైళ్లు చాలామటుకు ఖాళీగా వెళ్తుండటం గమనార్హం. మరోవైపు తిరుపతికి 10 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సమాచారం. ఇవి ఆ మార్గంలోని రద్దీకి అనుగుణంగా లేవన్న వాదనలూ వస్తున్నాయి.

కుంభ మేళా దెబ్బతో...
వాస్తవానికి గతేడాది వరకు తెలంగాణ ప్రాంతాల వైపు సంక్రాంతి సీజన్‌లో 10 వరకు ప్రత్యేక రైళ్లు నడిపారు. ఈసారి ఒక్క ప్రత్యేక రైలు నడపడం లేదు. మరోవైపు హైదరాబాద్‌ నుంచి మేడ్చల్, భువనగిరి తదితర ప్రాంతాలకు నడిచే 31 లోకల్‌ డెమూ రైళ్లను కూడా ఎత్తేశారు. వీటిని కుంభమేళా కోసం తరలించినట్లు సమాచారం.

రైళ్లను ఇటూ వేసి ఉంటే...
తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి కోసం 5,252 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. వీటిలో 1500 ఆంధ్రకు నడుస్తుండగా.. మిగిలిన 3,700 బస్సులు తెలంగాణకు నడుస్తున్నాయి. బస్సుకు 50 మంది చొప్పున వేసుకున్నా.. గత వారం రోజులుగా రోజుకు 3.2లక్షల మంది తెలంగాణ వాసులు వివిధ తెలంగాణ జిల్లాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరంతా 50 శాతం అదనపు చార్జీలు చెల్లించి మరీ బస్సుల్లో తిప్పలు పడుతూ వెళ్తున్నారు.ఈ అదనపు మోతను తప్పించడానికి ప్రత్యేక రైళ్లను కూడా వేసి ఉంటే ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గేదని ప్రయాణికులు అంటున్నారు.

కనీసం తిరుగు ప్రయాణంలోనైనా..!
కనీసం 10 రైళ్లయినా తెలంగా ణకు వేస్తే చాలా మేలు చేసిన వారవు తారని తెలంగాణ ప్రాంత ప్రయాణి కులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేస్తే కనీసం తిరుగు ప్రయా ణంలోనైనా తమకు అధిక చార్జీల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ దారిలోని వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ తదితర ప్రాంతాలు, ముంబై మార్గంలోని మేడ్చల్, కామారెడ్డి, బాసరా, నిజామాబాద్‌ ప్రాంతాల ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement