సాక్షి, రంగారెడ్డి: దీపం పథకం కింద రంగారెడ్డి జిల్లాకు 70 వేల వంటగ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5 వేల కనెక్షన్లను కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికల నియామవళి అమలులో ఉన్నందున ఏప్రిల్ మొదటి వారంలో అబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు ఈ పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. అయితే, వీటిని మరొకరికి అమ్మడానికి, బదిలీ చేయడానికి అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, గతంలో ఎంపిక చేసిన 22 వేల మంది జాబితాను తాజాగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.