930 కుటుంబాలకు లబ్ధి.. రూ. 80 కోట్ల మేర వ్యయం
సాక్షి, హైదరాబాద్: వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయం దిగువన సుమారు లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురౌతున్న నిర్వాసిత కుటుంబాలకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పరిహారంగా రూ. 8 లక్షలు చెల్లించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీని ద్వారా 930 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, సుమారు రూ. 80 కోట్ల వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పరిహారానికి సంబంధించి మంగళవారం శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.40 టీఎంసీలు మాత్రమే ఉండగా, దాన్ని ప్రస్తుత ప్రభుత్వం 8.23 టీఎంసీలకు పెంచింది. ఆయకట్టును సైతం 1.2 లక్షల ఎకరాల నుంచి 1.6 లక్షల ఎకరాలకు పెంచారు. దీంతో ఇక్కడ నిర్వాసితులవుతున్న కుటుంబాల సంఖ్య 687 నుంచి 930కి పెరిగింది. వీరికి ఇప్పటివరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద మొత్తంగా అన్నిరకాల లబ్ధిలతో కలిపి రూ.7.22 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడి నిర్వాసితుల్లో చాలామంది తమకు వన్ టైం సెటిల్‌మెంట్ కింద పరిహారం చెలిస్తే ముంపు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేస్తామని ముందుకు రావడంతో అందుకు అనుగుణంగా పరిహారాన్ని రూ. 8 లక్షలకు పెంచుతూ నిర్ణయం చేశారు.