మాల్యాతో సెటిల్మెంట్కు ఎస్బీఐ రెడీ!
♦ అసలు మొత్తం, కొంత వడ్డీ చెల్లిస్తేనే...
♦ మాల్యా షరతులకు నో...
ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా నుంచి ఎలాగైనా తమ బకాయిలను వసూలు చేసుకోవడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇందులోభాగంగా మాల్యాతో వన్‌టైమ్ సెటిల్మెంట్కు సిద్ధంగా ఉంది. తమకు రావాల్సిన అసలు మొత్తంతో పాటు కొంత వడ్డీని కోర్టుపరమైన ఖర్చులను చెల్లిస్తేనే ఈ సెటిల్మెంట్కు తాము ఒప్పుకుంటామని ఎస్బీఐ అంటోంది. అయితే, దీనిపై మాల్యా పెడుతున్న షరతులు తమకు ఆమోదయోగ్యం కావని పేర్కొంది. డెట్ రికవరీ చట్టాల్లో సవరణలను పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి ఎస్బీఐ చైర్పర్సన్ ఈ అంశాలను వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా ఎస్బీఐ సహా 17 బ్యాంకులకు(కన్సార్షియం) వడ్డీతోకలిపి రూ.9,000 కోట్లకుపైగానే బకాయిపడిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా ఆయనను పలు బ్యాంకులు ప్రకటించాయి. కోర్టుల్లో కూడా కేసులు వేశాయి. దీంతో మార్చి నెలలో మాల్యా దేశం విడిచి బ్రిటన్‌కు పరారయ్యారు. ఐడీబీఐ బ్యాంకుకు సంబంధించిన రుణ ఎగవేత కేసులో ముంబై మనీల్యాండరింగ్ నిరోధక కోర్టు ప్రకటిత నేరగాడుగా తేల్చింది. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ఇంటర్‌పోల్ సహా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బ్యాంకుల కన్సార్షియంకు ఎస్బీఐ నేతృత్వం వహిస్తోంది.
అసలు రూ.5,000 కోట్లు...
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, మాల్యా... బ్యాంకుల కన్సార్షియంకు చెల్లించాల్సిన అసలు రూ.4,850 కోట్లుగా అంచనా. దీనిపై ఇప్పటివరకూ చెల్లించాల్సిన వడ్డీతో కలిపితే మొత్తం రూ.9,000 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టుకు మాల్యా తరఫున లాయర్లు తమ క్లయింట్ సెప్టెంబర్‌కల్లా రూ.4,000 కోట్లు చెల్లించేందుకు సిద్ధమేనంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే. అంతేకాకుండా తనకున్న కొన్ని కోర్టు కేసులు పరిష్కారమైతే మరో రూ.2,000 కోట్లు కూడా కడతానని మాల్యా ప్రతిపాదించారు. అయితే, ఇప్పుడు బ్యాంకర్లతో సెటిల్మెంట్లో భాగంగా రూ.4,850 కోట్ల అసలు, వడ్డీ రూపంలో రూ.150 కోట్లతో పాటు బ్యాంకులు కోర్టు కేసుల కోసం ఖర్చుపెట్టిన ఫీజులను చెల్లించేందుకు మాల్యా సిద్ధమేనంటూ ఆయన సలహాదారులు సంకేతాలిచ్చినట్లు సమాచారం. అయితే, ఈ సెటిల్మెంట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా ఆమోదముద్ర లభిస్తేనే ముందుకెళ్తామని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.