సాక్షి నెట్‌వర్క్: వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం వడదెబ్బకు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ భర్త మాదిరెడ్డి భూపాల్(47) ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. భోజన విరామ సమయంలో చెట్ల కింద సేదదీరారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పనులు మొదలు పెట్టగా ఒక్కసారిగా అతను స్పృహతప్పి కిందపడిపోయాడు. తోటి కూలీలు వెంటనే చికిత్స నిమిత్తం ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నల్లగొండకు తరలించేందుకు 108ను పిలిపించగా అప్పటికే మృతి చెందాడు.
ఇదే జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చేగోజు కృష్ణయ్య(66) , బక్కమ్మ(60) దంపతులు తమ కుమారుడితో కలసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లారు. ఎండలో పనిచేయడంతో దంపతులిద్దరూ వడదెబ్బకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే బక్కమ్మ మృతిచెందింది. కృష్ణయ్యను స్థానిక ఆస్పత్రిలో చికిత్సచేయించినా ఫలితంలేకపోవడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కొడుకు భీష్మాచారి కూడా అస్వస్థతకు గురికాగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరు (ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సుంచు అచ్చమ్మ(70) ఆదివారం అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆత్మకూరు(ఎం)లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందింది. గుండాల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సంపతి యాదిరెడ్డి (65) ఉదయం బావి వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి వడదెబ్బకు గురై మృతిచెందాడు.
మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన గూని వెంకటమ్మ (80) సోమవారం ఉదయం కూతురి దగ్గరికి వెళ్దామని మద్దూరుకు బస్సులో వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడంతో బస్టాండులోనే అపస్మారకస్థితిలోకి చేరుకుని మృతి చెందింది. ఇదే జిల్లా గట్టుకు చెందిన వడ్డే పెద్ద ఈరన్న అలియాస్ రామారావు(36) భార్య ఊసేనమ్మ పుట్టిల్లు అయిన తుమ్మలచెరువుకు వెళ్లాడు. మార్గంమధ్యలో ఆలూరు పునరావాస కేంద్రం దగ్గర దిగాడు. ఎండ తీవ్రత బాగా ఉండడంతో అక్కడే వడదెబ్బకు గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేటకు చెందిన కిషన్ (50) ఉపాధి పని చేస్తూ ఎండదెబ్బకు తాళలేక సొమ్మసిల్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు.