సూక్ష్మ సేద్యానికి రూ.874 కోట్ల రుణం
వ్యవసాయశాఖ మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికోసం నాబార్డు నుంచి రూ.874 కోట్ల రుణం మంజూరైందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్‌లతో కలసి ఆయన గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
బిందు, తుంపర సేద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.126 కోట్లు ఇస్తుందని, లబ్ధిదారుల వాటాగా మరో రూ.92 కోట్లు మొత్తంగా రూ.1,092 కోట్లతో సూక్ష్మ సేద్యాన్ని చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 3.15 లక్షల ఎకరాలకు పైగా డ్రిప్ , స్పింక్లర్ సేద్యం కిందకు రావడం ఓ రికార్డని చెప్పారు. పాలి హౌస్ కింద సబ్సిడీ రుణాలు భారీగా పెంచామని, ఇటీవలే హరియాణా బృందం రాష్ట్రంలో పర్యటించి ఈ పథకాన్ని అభినందించిందని అన్నారు. వెయ్యి మందికి పాలి హౌస్ కింద రుణాలు ఇవ్వడం కూడా ఒక రికార్డని, ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ వల్లే సాధ్యమైందన్నారు.