'రబీలో 9గంటల విద్యుత్‌కు కృషి'
మహబూబాబాద్: భూగర్భ జలాలు పెరిగినందున రబీలో సాగు కూడా పెరగనుందని, వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. సోమవారం జరిగిన మహబూబాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం నుంచి హైదారాబాద్ వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్రానికి సీఎం లేఖ రాశారని, అది త్వరలో మంజూరవుతుందని పేర్కొన్నారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. ఉక్కు పరిశ్రమతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మహబూబాబాద్‌లో బియ్యం, గుట్కా, అవయవాల దందా తీవ్రంగా సాగుతున్నదని, ప్రభుత్వ భూముల ఆక్రమణ కూడా జరుగుతున్నదని, వాటిని నిరోధించే బాధ్యత కలెక్టర్, ఎస్పీలదే అని కడియం స్పష్టం చేశారు. సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.