
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా కేసులు నమోద య్యాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 కేసులు నమోదు కాగా, సూర్యాపేటలో కొత్తగా మూడు కేసులు, గద్వాలలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 943కు చేరింది. అలాగే బుధవారం ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 24కు చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 194 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 725 చికిత్స పొందుతున్నారు.
సగటు కేసులు సూర్యాపేటలోనే అధికం..
రాష్ట్రంలో గత వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 3 నాలుగు జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఇప్పటిదాకా ఒక్క హైదరాబాద్‌లోనే 462 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా సూర్యాపేట నిలిచింది. అక్కడ ఏకంగా 83 కేసులు నమోదయ్యాయి. జనాభాతో పోలిస్తే అధికంగా కేసులు నమోదైన జిల్లాగా సూర్యాపేట నిలిచింది. ఆ జిల్లాలో మొత్తం 13 లక్షల జనాభా ఉంటే.. ఇప్పటివరకు 83 కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మందికి సగటున 6.5 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జనాభా కోటి వరకు ఉండగా.. ఇక్కడ 462 కేసులు నమోదయ్యాయి. చదవండి: లాక్‌డౌన్ అమలుకు ‘కరీంనగర్ ఫార్ములా’
ఇక్కడ ప్రతి లక్ష మందిలో 4.62 మందికే కరోనా సోకింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అక్కడి జనాభా 9.27 లక్షలు. ఆ జిల్లాలో ప్రతి లక్ష మందిలో సగటున నలుగురు వైరస్ బారినపడ్డారు. గద్వాల జిల్లాల్లో 36 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. గద్వాల జిల్లాలో మొత్తం జనాభా 6 లక్షలు. ప్రతి లక్షలో సగటున ఆరుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాలతో పోల్చితే ఈ నాలుగు ప్రాంతాల్లోనే కేసులు సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నాయి.
ప్లాస్మా థెరపీకి అనుమతివ్వండి: మంత్రికి విర్కో బయోటెక్ విన్నపం
కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీకి అనుమతివ్వాలని విర్కో బయోటెక్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆయనను బుధవారం కలిశారు. కరోనాకు ప్లాస్మా థెరపీ, ఇమ్యునోగ్లోబిన్ అందించడం ద్వారా చికిత్స అందించేందుకు కేంద్ర అనుమతి కోసం సంప్రదించిన మొదటి కంపెనీ తమదేనని మంత్రికి తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ అనుమతి కూడా వచ్చిందని, కాబట్టి ఇక్కడ చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొదటి 3 నెలలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇమ్యునోగ్లోబిన్‌లు వైరస్ నుంచి సమర్థంగా రక్షణ అందిస్తాయని విర్కో బయోటెక్ డైరెక్టర్ రాజేశ్ తుమ్మూరు తెలిపారు. ఈ విషయంపై నిపుణుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment