లెక్క తేలింది.. | A comprehensive survey of farmers in Adilabad | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది..

Published Sat, Jun 17 2017 12:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

లెక్క తేలింది.. - Sakshi

లెక్క తేలింది..

► ముగిసిన రైతు సమగ్ర సర్వే
► జిల్లాలో 81.5 శాతం నమోదు   
► పూర్తి కాని లక్ష్యం..
► సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు
► నమోదు చేసుకోనివారికి నష్టమే

 

జిల్లాలో రైతుల సంఖ్య 1,32,268
నమోదు చేసుకున్న రైతులు    1,07,888
నమోదు శాతం 81.57
మండలాలు 18
గ్రామాలు 510
సర్వేలో పాల్గొన్న సిబ్బంది 109

ఆదిలాబాద్‌టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే గురువారం ముగిసింది. జిల్లాలో కొంతమంది రైతులు ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రతీ అన్నదాతకు ఎకరానికి రూ.4 వేలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి ఈ నెల 15 వరకు రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ అధికారులు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టారు.

ఈ నెల 10 వరకు గడువు ముగిసినప్పటికీ సర్వే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఐదు రోజులపాటు గడువు పెంచింది. అయినా ఒక శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,32,268 మంది రైతులు ఉండగా, ఇందులో 1,07,888 మంది సర్వేలో నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 24,380 మంది రైతులు సర్వే చేయించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 81.57 శాతం నమోదు కాగా, 18.43 శాతం సర్వే చేసుకోలేదు. కొంతమంది రైతులు ఉపాధి రీత్యా వారి సొంత గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నందున వారి వివరాలు లభ్యం కాలేదని తెలుస్తోంది.

లెక్క పక్కా..
రైతుల సమగ్ర సర్వేతో భూములు

సాగు విస్తీర్ణం పక్కాగా తెలుస్తోంది. గతంలో రైతులు ఎక్కడ, ఏ పంటలు, ఎంత మేరకు వేశారనేది రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పూర్తి స్థాయిలో సమాచారం ఉండేది కాదు. క్షేత్రస్థాయిలో వేసిన పంటలకు అధికారుల లెక్కలకు ఎలాంటి పొంతన ఉండేది కాదు. ప్రభుత్వం ప్రతి ఎకరం సాగుకు రూ.4 వేలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. మండలాల్లో ఏవోతోపాటు ఏఈవో అందుబాటులో ఉండడంతో రైతుల వివరాలు సమగ్రంగా సేకరించారు. సర్వేలో 79 మంది ఏఈవోలు, 18 మంది ఏవోలు, ఆరుగురు హెచ్‌ఈవోలు, ఆరుగురు ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు.

24 అంశాలతో వివరాలు..
ప్రభుత్వ ఆదేశాలతో రైతుల సమగ్ర సర్వేను అధికారులు పకడ్బందీగా చేపట్టారు. వ్యవసాయ శాఖ రూపొందించిన నమూనా పత్రంలో రైతులకు సంబంధించిన 24 అంశాలు ఉన్నాయి. నమూనా ఆధారంగా రైతుల వివరాలను నమోదు చేశారు. ఇందులో రైతు పేరు, తండ్రి పేరు, సామాజిక వర్గం, ఆధార్‌ కార్డు, వరుస సంఖ్య, బ్యాంక్‌ ఖాతా, భూముల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, నీటి సౌకర్యం ద్వారా భూమి, వర్షాధారం కింద సాగయ్యే భూమి సాగు చేసే పంటల రకాల వివరాలు, ఫోన్‌ నంబరుతో సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఏఈవోలు తమ గ్రామాల పరిధిలో కంప్యూటర్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం సేకరించిన వివరాలతోనే ప్రభుత్వం అందించే రాయితీలు వర్తించే వీలుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సర్వేలో నమోదు చేసుకోనివారికి ప్రభుత్వం నుంచి రైతులకు అందజేసే సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలు వర్తించబోవని అధికారులు పేర్కొంటున్నారు.

సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు
రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. గురువారంతో గడువు ముగిసింది. 10వ తేదీ వరకు 80 శాతం సర్వే పూర్తి కాగా, ఐదు రోజులు గడువు పెంచినప్పటికీ ఒక శాతం కంటే ఎక్కువ రైతులకు సంబంధించిన వివరాలు లభ్య కాలేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో ఉండే భూ యాజమానులు వివరాలు నమోదు చేసుకోలేదు. గడువు దాటితే తామేమీ చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు గతంలో చెప్పినప్పటికీ ఇంకా కొంతమంది సమగ్ర భూ సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేదు. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి రూ.4 వేలు సాగు ఖర్చుకు ఇస్తుంది. ఖరీఫ్, రబీ పంటలు రెండింటికీ ఏడాదికి రూ.8 వేలు రైతు ఖాతాల్లో జమ కానున్నాయి.

ఏజెన్సీ ప్రాంతంలో..
జిల్లాలో గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు పట్టాలు లేవు. దీంతో సమగ్ర సర్వేలో నమోదు చేసుకోలేదు. సర్వే ఆధారంగా ప్రభుత్వం అందజేసే రూ.4వేలు అందవని గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఎళ్లుగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న చాలా మంది గిరిజనుల భూములకు కూడా పట్టాలు లేవు. దీంతో వారి పేర్లు కూడా నమోదు చేసుకోలేదు. జిల్లాలో దాదాపు 10 వేల మందికిపైగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.

సమగ్ర సర్వే ముగిసింది
జిల్లాలో 94 క్లస్టర్‌లో 510 రెవెన్యూ గ్రామాల్లో లక్షా 7,888 మంది రైతులు సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నారు. 81.57 శాతం నమోదైంది. సర్వే చేయించుకోని రైతులకు నోటీసులు జారీ చేస్తాం. సర్వే చేయించుకోని రైతులకు ప్రభుత్వం నుంచి అందజేసే రాయితీ, తదితర పథకాలు వర్తించవు. జిల్లాలో అత్య«ధికంగా బోథ్‌ మండలంలో 89 శాతం సర్వే చేసుకోగా, ఆదిలాబాద్‌ అర్బన్‌ మండలంలో 63 శాతం నమోదు అయ్యింది. – రమేష్, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement