ఆరుగురిని బలిగొన్న అప్పు
ఆరుగురిని బలిగొన్న అప్పు
సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులకు తెలియ కుండా కొడుకు చేసిన అప్పులు ఓ కుటుం బాన్ని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన కస్తూరి జనార్దన్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమారులు సురేశ్, అశోక్ ఉన్నారు. పెద్ద కుమారుడు సురేశ్‌కు భార్య ప్రభాత, ఇద్దరు కుమార్తెలు సిరి, రుత్విక ఉన్నారు.
జనార్దన్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. సురేశ్ ఖాళీగా ఉండ టంతో కంప్యూటర్ల రిపేర్, సేలింగ్ దుకాణాన్ని పెట్టించాడు. కొంతకాలం దుకాణాన్ని నిర్వ హించిన సురేశ్.. తల్లిదండ్రులకు తెలియ కుండానే భారీగా అప్పులు చేశాడు. వడ్డీవ్యా పారులు వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 11న పుణె వెళ్తున్నానని చెప్పి సురేశ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో పెట్టుకున్నాడు. సురేశ్‌కు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇంటికి రావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది.
పదేపదే ఇంటి వద్దకు వచ్చి వేధిస్తుండడంతో అవమానాన్ని తట్టుకోలేక సురేశ్ తల్లిదండ్రులు జనార్దన్ (57), చంద్రకళ(50), సోదరుడు అశోక్(26), భార్య ప్రభాత(30), కుమార్తెలు సిరి(4), రుత్విక(2) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొద్దున పాలు పోసేందుకు వచ్చిన యువకుడు ఎంతసేపు గేటు కొట్టినా తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి చెప్పాడు. అందరూ వచ్చి కిటికీలు, తలుపులు పగులగొట్టి చూడగా.. ఆరుగురు విగతజీవు లుగా పడి ఉన్నారు. వెంటనే జిల్లా కేంద్రంలోని పోలీసులకు సమాచారం అందించేందుకు గంటపాటు ప్రయత్నించినా అధికారులెవరూ ఫోన్ ఎత్తలేదని స్థానికులు ఆరోపించారు.
షేర్ మార్కెట్‌లో పెట్టేందుకు..
షేర్ మార్కెట్‌లో పెట్టేందుకు సురేశ్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చాడు. అందులో నష్టం రావడంతో అటు తల్లిదండ్రులకు.. ఇటు భార్యకు చెప్పుకోలేక కుంగిపోయాడు. వడ్డీ వ్యాపారులు ఒత్తిడి తేవడంతో ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నెల 11 ఇంట్లో తల్లిదండ్రులు, భార్యకు చెప్పి పుణె వెళ్లాడు. మరుసటి రోజు భార్య ప్రభాతకు ఫోన్ చేసి పుణె నుంచి ముంబై వెళ్తు న్నట్టు చెప్పాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. సురేశ్ తమ వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడని అవన్నీ చెల్లించకపోతే బాగుండదని వడ్డీ వ్యాపారులు జనార్దన్‌ను హెచ్చరించారు. సురేశ్ సుమారు రూ.3 కోట్ల దాకా అప్పులు చేసి ఉంటాడని తెలుస్తోంది.
మోసపోయిన చిన్న కొడుకు..
జనార్దన్ చిన్న కొడుకు అశోక్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో కుమారుడిని ఏదో ఉద్యోగంలో పెట్టించాలను కున్నాడు. ఆ ఇంటి పక్కనే ఉండే ఓ మహిళ తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని.. వారు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారని జనార్దన్‌కు చెప్పింది. దీంతో ఆయన.. ఆమె సూర్యాపేటకు చెందిన వెంపటి సత్యనారాయణ, బెంజారపు ఉపేందర్‌లను కలిశాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు రూ.14 లక్షలు ఖర్చు అవుతుందని వారు చెప్పారు. దీంతో జనార్దన్ గతేడాది రెండు విడతల్లో రూ.14 లక్షలు కట్టాడు. తీరా మోసపోయినట్టు తెలుసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామన్న వారి వద్దకు వెళ్లి అడగ్గా.. వాయిదాల పద్ధతిలో డబ్బులు ఇస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఒక్క పైసా ఇవ్వలేదు. పైగా బెదిరించారు. రెండ్రోజులుగా వారి ఫోన్లు కూడా స్విచ్ఛాప్‌లో ఉన్నాయి.
అమ్మను సోదరుల ఇళ్లకు పంపి..
జనార్దన్ వద్దనే కొన్నేళ్లు ఆయన తల్లి రాములమ్మ ఉంటోంది. ఎన్నడూలేని విధంగా ఆదివారం ఇంట్లో నుంచి ఆమెను వెళ్లిపోమన్నాడు. సూర్యాపేటలోనే ఉంటున్న సోదరుల ఇళ్లకు తల్లిని పంపించాడు. తర్వాత అదేరోజు రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అశోక్, ప్రభాతల వద్ద సూసైడ్ నోట్లు లభించాయి. అందులో అశోక్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించగా.. సురేశ్ భార్య ప్రభాత తన భర్త అప్పులు చేశాడో.. చేయలేదో తనకు తెలియదని పేర్కొంది.
