నీడనిస్తుందనుకుంటే నిండు ప్రాణం బలి
- కొట్టం కూలి కౌలు రైతు దుర్మరణం
- పటేల్‌గూడెంలో విషాదం
లింగాలఘణపురం : బలమైన ఈదురు గాలులు, వర్షం నుంచి రక్షించి నీడనిస్తుందనుకున్ను కొట్టమే ఓ రైతును బలి తీసుకుంది. మరో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మండలంలోని పటేల్‌గూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానిక రైతుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కౌలు రైతు అనుముల మల్లయ్య(65) లింగాలఘణపురానికి చెందిన మంద నర్సిరెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం అక్కడే వంకాయతోటకు మందు వేశాడు.
ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు, వర్షం వస్తుండడంతో సమీపంలోని నకిరెడ్డి యాదయ్య కొట్టం వద్దకు వచ్చాడు. ఇద్దరు ఆ కొట్టంలోనే తలదాచుకున్నారు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడంతో కొట్టం పైకప్పుకు ఉన్న ఇనుకరేకులు ఎగిరిపోయాయి. రేకులు వేసిన సిమెంట్ స్తంభాలతోపాటు కొట్టంలోని కణి (రాయి స్తంభం) విరిగి మల్లయ్య తలపై పడింది. తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా యాదయ్య వెంటనే కణిని అతడి తలపై నుంచి తొలగించాడు. స్పృహలేకపోడంతో సమీపంలోని రైతు వీరారెడ్డి వద్దకు తీసుకొచ్చాడు. అప్పటికే మల్లయ్య మృత్యువాత పడ్డాడు.