కరడుగట్టిన ముఠా గుట్టురట్టు
- ముఠా సభ్యుడి పట్టివేత
- 24 తులాల బంగారు నగలు స్వాధీనం
నాగోలు,న్యూస్‌లైన్: ఇళ్లల్లోకి చొరబడి కత్తులు, మారుణాయుధాలు చూపించి దాడిచేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యుడిని, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వ్యక్తిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వనస్థలిపురం ఏసీపీ ఆనందభాస్కర్‌తో కలిసి డీసీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు మహ్మద్‌ఆసిఫ్ (38) కొన్నేళ్లక్రితం నగరానికి వలసొచ్చి బాబానగర్‌లో స్థిరపడి ఈ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక్కడే రెండు హెయిర్‌సెలూన్ దుకాణాలతోపాటు 20 ఆటోలను కిరాయికిస్తూ జీవిస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తులు ఆసిఫ్‌కు బావ వరసయ్యే జావిద్ (32),అల్తాఫ్ (22),వసీం, (22),శివ (23)లను నగరానికి పిలిపించి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి దొంగత నాలకు పథకం పన్నారు.
తన ఆటోలో రెండురోజులపాటు నగరంలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇలా ఫిబ్రవరి 19న మీర్‌పేట జిల్లెలగూడ మిథులానగర్‌లో నివాసముంటున్న శ్రీధర్ ఇంట్లోకి చొరబడిన వీరు భార్యాభర్తలపై దాడిచేసి కత్తులు చూపించి కాళ్లు చేతులు కట్టేసి 10 తులాల నగలు, సెల్‌ఫోన్లు ఇతర సామగ్రి దోచుకెళ్లారు. అదేనెల 22న తెల్లవారుజామున మీర్‌పేట విరాట్‌నగర్‌లో నివాసముంటున్న డాక్టర్ వామనరావు ఇంట్లోకి చొరబడి కత్తులు,ఆయుధాలతో దాడిచేసి 20 తులాల నగలు, నగదు, ఇతర వస్తువులు దోచుకెళ్లారు.
దొంగిలించిన నగలను యాకుత్‌పురాలోని మహ్మద్ ఇంతియాజుద్దీన్ అలియాస్ సంరోజ్ వద్ద తాకట్టుబెట్టి వచ్చిన డబ్బుతో ఉత్తరప్రదేశ్ ముఠా వెళ్లిపోగా మిగిలిన డబ్బులను ఆసిఫ్ తీసుకున్నాడు. మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుస్టేషన్ పరిధుల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ-ఛానల్‌కు పట్టుబడిన ఆటోల వివరాలు తెప్పించారు.
ఆటోనెంబర్ (ఏపీ11టీఏ199)తో రెండు ఆటోలు ఉండడంతో.. దాని యజమాని ఆసిఫ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. కాగా బంగారం తాకట్టు పెట్టుకున్న ఇంతియాజుద్దీన్ ను కూడా అరెస్టు చేసి 24 తులాల నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మీర్‌పేట సీఐలు శ్రీధర్‌రెడ్డి, సుబ్బయ్య, ఎస్‌ఐలు భాస్కర్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.